కేవలం ఒకే ఒక్క రోజు మిగిలుంది. హుజూర్ నగర్ ప్రజలు మరి ఎవరికి జై కొడతారో సోమవారం తేలిపోనుంది. అయితే జరుగుతున్నది కేవలం ఒకే ఒక స్థానానికి ఉపఎన్నిక. కానీ నెలరోజులుగా సార్వత్రిక ఎన్నికలను తలపించేరీతిలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ ఇలా నాలుగు ప్రధాన పార్టీలు బరిలోకి దిగడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఓటరు దేవుడ్ని ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు విశ్వప్రయత్నం చేశాయి. ఇప్పుడు ప్రచార పర్వానికి తెరపడటంతో.. తీర్పు ఎలా ఉండబోతుందోనన్న టెన్షన్ మొదలైంది.
హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 8 మండలాలున్నాయి. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరుగుతున్న నాలుగో ఎన్నికలివి. ప్రస్తుతం ఎన్నికల బరిలో
మొత్తం 28 మంది నిలిచారు. టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతి రెడ్డి, టీడీపీ తరఫున చావా కిరణ్మయి, బీజేపీ నుంచి రామారావు పోటీ చేస్తున్నారు. వీరిలో ప్రధాన పోటీ మాత్రం సైదిరెడ్డి, ఉత్తమ్ పద్మావతి రెడ్డి మధ్యనే ఉండనుంది.
ప్రచారం ముగియడంతో ఎలాంటి రాజకీయ పార్టీల జెండాలు ప్రదర్శించకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. రాజకీయనాయకులు నియోజకవర్గం విడిచివెళ్లాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలో 48 గంటల పాటు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటర్ స్లిప్పులను ఇప్పటికే ఇంటింటికీ పంపిణీ చేశారు. మొత్తం 2 లక్షల, 20 వేల 108 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ కార్డుతోపాటు 15 రకాల గుర్తింపు కార్డుల ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది ఎన్నికల కమిషన్.
ప్రచార పర్వం ముగియడంతో ప్రలోభపర్వానికి తెరలేపాయి పార్టీలు. ఇప్పటికే జిల్లాలో పెద్ద ఎత్తున నగదు, మద్యం సీజ్ చేశారు అధికారులు. చివరి రెండు రోజుల్లో ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉండటంతో ఎన్నికల కమిషన్ నిఘాను మరింత పటిష్టం చేసింది.