తెలుగు రాష్ట్రాలకు వాన గండం.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

Update: 2019-10-22 01:15 GMT

తెలుగు రాష్ట్రాలకు వాన గండం పొంచివుంది.. ఇప్పటికే అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలతో రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా మరో అల్పపీడనం కుంభవృష్టిని కురిపించేందుకు సిద్ధమవుతోంది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర పరిసరాలను ఆనుకుని బంగాళాఖాతంలో రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తమిళనాడు, దానిని ఆనుకుని వున్న ఉత్తర శ్రీలంక, కొమరిన్‌ ప్రాంతాల మీదుగా కోస్తా ఆంధ్ర వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ అధికారులు తెలిపారు. ఇక ఉత్తరాంధ్ర మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు, ప్రకాశం,నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతవారణ అధికారులు తెలిపారు.

అటు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి.. నాగర్‌కర్నూల్, వికారాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షం కురువగా, హైదరాబాద్‌ నగరంలో తేలికపాటి జల్లులు పడ్డాయి. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలకు వరి పంటకు నష్టం వాటిల్లింది. కరీంనగర్‌ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. మరో మూడ్రోజులు భారీ వర్షాలు తప్పవన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Similar News