కేరళ, తమిళనాడు, కర్నాటకలో వర్షబీభత్సం కొనసాగుతోంది. మరో 48 గంటలపాటు ఈ కుండపోత ప్రభావం ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. కర్నాటకలో దాదాపు 10 జిల్లాలు వరద విలయానికి చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. ధార్వాడ్, బెళగావి, కలబురిగి, విజయ్‌పురా, షిమొగ, చిక్‌మంగళూరు సహా పలు చోట్ల.. సహాయ చర్యల కోసం ప్రత్యేక బలగాల్ని రంగంలోకి దించారు. సోమవారం పలు ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల వర్షం కురవడంతో పట్టణాలన్నీ జలమయమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోకి కూడా నీరు చేరింది. పదుల సంఖ్యలో గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. పరిస్థితిపై యడ్యూరప్ప సర్కార్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తోంది.
ఇక కేరళలోనూ భారీవర్షాలతో అప్రమత్తమయ్యారు. మొన్నటి వరద విలయం దృష్టా ఈసారి అన్ని ప్రాంతాల్లో ముందస్తుగా సమీక్షలతో పరిస్థితి ఎదుర్కొనేందుకు టీమ్‌లను సిద్ధం చేశారు. ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరో 9 జిల్లాల్లో ఆ రేంజ్ అలర్ట్ కొనసాగుతోంది. అటు, ప్రాజెక్టుల్లో నీటిమట్టాలపై సమీక్షతోపాటు ముందస్తుగా కొన్ని చోట్ల నీటి విడుదల కూడా చేయడం ద్వారా వరదలకు ఆస్కారం లేకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. వరద హెచ్చరికలు, పలుచోట్ల కొండ చరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో.. టూరిస్ట్‌లు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. కొచ్చి సహా మరికొన్ని జిల్లాల్లో భారీవర్షాల ప్రభావంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మత్స్యకారులు ఎవరూ చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఎర్నాకుళంలో వరద బీభత్సానికి కొన్ని చోట్ల హైవేల పైనుంచే వరద ప్రవహించింది.
తమిళనాడులో కూడా వర్షబీభత్సం కొనసాగుతోంది. కోయంబత్తూర్, నీలగిరి, థేని, దుండిగల్ జిల్లాలో అతిభారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. దాదాపు 20 సెంటీమీటర్ల వర్షం పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఒకేసారి ఏకధాటిగా భారీవర్షం పడితే.. ముంపు ప్రభావం తీవ్రంగా ఉంటుంది.