వద్దంటే వానలు పడుతున్నాయి.. అల్పపీడనాలు కుండపోత వానలను మోసుకొస్తున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది.. అల్పపీడనం ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.. కోస్తా జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం వద్ద గురువారం 16వ నెంబరు జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది. భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతం నుండి పంపా రిజర్వాయరులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీనితో అధికారులు ముందుజాగ్రత్తగా ఐదు గేట్లకు గాను మూడు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దీంతో ఆ నీరంతా రహదారిపైకి చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అన్నవరం గ్రామం మీదుగా ట్రాఫిక్ మళ్లించారు.
వర్షాలతో ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి.. వంశధార, నాగావళి, మహేంద్ర తనయ, బహుదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నీటి ఉధృతి పెరుగుతుండడంతో గొట్టా బ్యారేజీ 22గేట్లు ఎత్తివేశారు. పెదరోకలపల్లి రహదారి వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. రెంటికోట గ్రామం వద్ద కాలువ గట్లు తెగిపడటంతో ఆంధ్రా, ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.. ఉప్పుటేరు ఉధృతికి పూడిలంక గ్రామం వరదలో చిక్కుకుపోయింది.
అటు కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద ఉధృతి మళ్లీ పెరిగింది.. ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది.. శ్రీశైలం రిజర్వాయర్ కు ఇన్ ఫ్లో అంతకంతకూ పెరుగుతోంది.. దీంతో 10 గేట్లను 24 అడుగుల మేర ఎత్తి వచ్చిన నీటినంతా దిగువకు విడదుల చేస్తున్నారు.. ఇక నాగార్జునసాగర్ జలాశయానికి మరోసారి వరద పోటెత్తింది. శ్రీశైలం డ్యాం నుంచి సాగర్‌కు వరదనీటి ఉద్ధృతి కొనసాగుతోంది. 6 లక్షలకుపైగా క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం 22 క్రస్ట్‌గేట్లను ఎత్తి అంతే మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.