ఒంగోలులో బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం భేటీ కావడం చర్చనీయాంశం అయింది. వీరిద్దరూ తాజా రాజకీయ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఉదయం వల్లభనేని వంశీ, మధ్యాహ్నం కరణంతో సుజనాతో భేటీ కావడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కేవలం ఆయనతో ఉన్న పరిచయంతోనే సమావేశమయ్యానని కరణం బలరాం చెప్పుకొచ్చారు.
బీజేపీ సిద్ధాంతాలు నమ్మి వచ్చే వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని ఇటీవలే సుజనా చౌదరి చెప్పారు. ఇదే సమయంలోనే ఆయన టీడీపీ నేతలతో వరుసగా భేటీ అవుతుండటం ఆసక్తికరంగా మారింది. ఒంగోలులో గాంధీజీ సంకల్పయాత్రలో పాల్గొన్న సుజనా చౌదరి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో ప్రజలే చెబుతారని అన్నారు. బీజేపీలో చేరమని ఎవరిని టార్గెట్ చేయడం లేదని చెప్పారు సుజనా.