అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలపై ఆగని కక్షసాధింపులు..!

Update: 2019-10-27 09:42 GMT

అనంతపురం జిల్లాలో రాజకీయ కక్షలు బుసలు కొడుతున్నాయి. ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తున్న వైసీపీ నేతలు.. దౌర్జన్యాలకు దిగుతున్నారు. తాజాగా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో టీడీపీ నాయకుడు నాగరాజుకు చెందిన ఇంటి చుట్టూ స్థానిక వైసీపీ నేత బండలు పాతించాడు. ఎమ్మెల్యే అండతోనే ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం వర్గీయులు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నారాయణరెడ్డికి.. టీడీపీ నేత కురుబా నాగరాజుకు మధ్య కొన్నాళ్లుగా వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నాగరాజు ఇంటి చుట్టూ ప్రభుత్వ రోడ్డుపైనే అడ్డంగా నాపరాళ్లు పాతించడం గొడవకు దారి తీసింది. వీటిని తొలగించేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించడం, వైసీపీ వర్గీయులు కూడా అక్కడికి వచ్చి ప్రతిఘటించడంతో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో పరిస్థితులు తెలుసుకున్న పోలీసులు ప్రస్తుతం పికెట్ ఏర్పాటు చేశారు.

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాజు బాధితుల పక్షాన మాట్లాడేందుకు గ్రామానికి వెళుతుండగా పోలీసులు రెడ్డిపల్లి వద్ద అరెస్ట్ చేశారు. బుక్కరాయసముద్రం స్టేషన్‌కు తరలించారు. ఈ నిర్బంధంపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధి అండదండలు మేరకే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో వేసిన రోడ్డును ఏ విధంగా అడ్డుకుంటారని, అడ్డంగా బండలు ఎలా పాతుతారని ప్రశ్నిస్తున్నారు. కులాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి కుట్రలు చేయాలని చూస్తున్నారని ఎమ్మార్పీఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

Similar News