వల్లభనేని వంశీ రాజీనామా ఎపిసోడ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు కీలక నేతలు పార్టీ మారినా.. ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ వీడలేదు. ఇప్పుడు వంశీ రాజీనామా చేయడం.. పార్టీ మారుతారని ప్రచారంతో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. వంశీ మనసు మార్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉదయం పార్టీ నేతలతో మాట్లాడిన చంద్రబాబు.. వంశీని బుజ్జగించే బాధ్యతను.. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ నారాయణకు అప్పగించారు.
అంతకుముందు చంద్రబాబు-వంశీల మధ్య లేఖల పరంపర కొనసాగింది. గన్నవరం శాసనసభ్యుడిగా ఉన్న వంశీ ఆదివారమే MLA పదవికి, TDPకి రాజీనామా చేశారు. తన నిర్ణయం తెలుపుతూ చంద్రబాబుకు లేఖ రాశారు. దీనిపై చంద్రబాబు వెంటనే స్పందించారు. స్థానిక వైసీపీ నేతల వేధింపుల వల్లే రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు వంశీ తెలపడాన్ని ప్రస్తావిస్తూ.. అప్రజాస్వామిక విధానాలపై కలిసి పోరాడదామని అన్నారు. దానికి వంశీ కూడా సమాధానం ఇచ్చారు. తొలిసారి విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయానని, 5ఏళ్లు విలువైన సమయం వృధా అయిందని ఏనాడూ బాధపడలేదని అన్నారు. ఒక సీనియర్ నేతపై, ఐపీఎస్ అధికారిపై పోరాటం చేశానన్నారు. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా చూసేందుకు ప్రత్యర్ధులు ఎలాంటి ఒత్తిడి తెచ్చారో అందరికీ తెలుసన్నారు వంశీ. రెండో లేఖపైన స్పందించిన చంద్రబాబు.. నీ పోరాట స్ఫూర్తిని అధిష్టానం గుర్తు పెట్టుకుంటుందన్నారు. కేశినేని, కొనకళ్లతో చర్చించి ముందడుగు వేయాలని సూచించారు..
లేఖల సంగతి ఎలా ఉన్నా.. టీడీపీ అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో ఎంపీ కేశినేని నాని సమావేశమయ్యారు. వంశీ ఎందుకంత కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకోవాలని.. వైసీపీతో సమస్యలు ఎదురైతే.. పార్టీ తరపున అండగా ఉంటామని ధైర్యం చెప్పండంటూ చంద్రబాబు సూచించారు. వంశీని వదులుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదన్నారు ఎంపీ కేశినేని. కేసులకు భయపడి రాజకీయాలకు దూరంగా ఉండకూడదన్నారు. పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న వంశీ.. అధిష్టానం బుజ్జగింపులతో వెనక్కు తగ్గుతారో లేదో చూడాలి.