గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఆయన రాజీనామా వ్యవహారం రెండు రోజుల నుంచి కలకలం రేపుతోంది. మొదట అధినేత చంద్రబాబుకు లేఖ రాసిన వంశీ.. వైసీపీ వేధింపుల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు లేఖలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. రాజకీయ దాడులపై అంతా కలిసి పోరాడుదాం అంటూ వంశీకి ధైర్యం చెప్పారు. దీంతో మరోసారి వంశీ.. చంద్రబాబుకు లేఖ రాశారు. కనిపించే శత్రువతో పోరాడడం సులభమని.. కానీ, పార్టీలోనే కనిపించని శత్రువులతో పోరాడలేక పార్టీ వీడుతున్నానని తెలిపారు. మరోసారి దీనిపై స్పందించిన చంద్రబాబు.. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలతో మాట్లాడి ముందుకు వెళ్లండని సూచించారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబుతో కాసేపటి కిందట ఎంపీ కేశినేని నాని సమావేశమయ్యారు. వంశీ ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకోవాలని.. వైసీపీ కారణంగా ఏవైనా సమస్యలు ఎదురైతే.. పార్టీ తరపును అంతా అండగా ఉంటామని ధైర్యం చెప్పండంటూ చంద్రబాబు సూచించారు.
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వదులుకోవడానికి తమ పార్టీ సిద్ధంగా లేదని ఎంపీ కేశినేని అన్నారు. వంశీ కూడా టీడీపీని వీడడానికి సిద్ధంగా లేరని.. ఆయనది టీడీపీ డీఎన్ఏ అని అన్నారు. వంశీతో ప్రస్తుతం మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నామని.. వంశీ లాంటి నాయకుడు రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది కాదన్నారు. కేసుల గురించి భయపడి రాజకీయాలకు దూరంగా ఉండకూడదన్నారు కేశినేని.