ఏలూరులోని జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. గత నెల 11 నుంచి పలు కేసుల్లో చింతమనేని రిమాండులో ఉన్నారు. వరుసగా ఒకదాని తర్వాత మరో కేసు పెడుతూ రిమాండుకు పోలీసులు తరలిస్తున్నారు. ప్రస్తుతం చింతమనేనిపై 66 కేసులు నమోదు కాగా.. 22 కేసులు దర్యాప్తులో ఉన్నాయి. ఇటీవల ఓ కేసులో బెయిల్ వచ్చింది. అయినా వేరే కేసులో ప్రస్తుతం జైల్లో రిమాండు ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చింతమనేనితో లోకేష్ భేటి ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ వేధింపులపైనే వీరి మధ్యచర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
చింతమనేనితో మాట్లాడిన అనంతరం ఆయన నేరుగా పెదవేగి మండలం దుగ్గిరాలలోని చింతమనేని ఇంటికి వెళ్లారు. చింతనమనేని కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. పార్టీ అన్నిరకాలుగా ఆదుకుంటుందని.. చింతమనేని తరపున న్యాయపోరాటం చేస్తామని లోకేష్ తెలిపారు.