తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీతో ఆ పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారు. వంశీని బుజ్జగించే బాధ్యతను కేశినేని నాని, కొనకళ్లకు అప్పగించారు చంద్రబాబు. అతనితో మూడు గంటలపాటు చర్చించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీని వీడి వెళ్లవద్దని, అధినేత చంద్రబాబు అండగా ఉంటారని ధైర్యం చెప్పారు. వంశీకి చెప్పాల్సిందంతా చెప్పామని, బంతి ఇప్పుడు ఆయన కోర్టులో ఉందన్నారు.
వల్లభనేని వంశీ పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తే తప్పుడు ఫోర్జరీ కేసు పెట్టారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. గన్నవరం నియోజకవర్గ నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. ఇంఛార్జ్ లేకుండానే సమావేశం కొనసాగింది. తప్పుడు కేసులకు వంశీ భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు చంద్రబాబు. రాజకీయాల్లో ఒత్తిళ్లకు భయపడితే.. ఏమీ చేయలేమన్నారు పిరికితనం మంచిది కాదని మరోసారి సూచిస్తున్నట్లు తెలిపారు.
వల్లభనేని వంశీ వ్యవహారంపై స్పందించారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి.. రెండు రోజుల నుంచి తనతో టచ్‌లో లేడని చెప్పారు...గత సమావేశం సమయంలోనూ తమ మధ్య ఎలాంటి రాజకీయాలు చర్చకు రాలేదని స్పష్టం చేశారు. వంశీతోపాటు ఎవరు బీజేపీలోకి వచ్చినా ఆహ్వానిస్తామన్నారు సుజనా చౌదరి.
వల్లభనేని వంశీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. అయితే వంశీ కన్ఫ్యూజన్‌లో ఉన్నారని.. పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నాయి టీడీపీ శ్రేణులు.