జగన్ సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది: సీబీఐ కోర్టు

Update: 2019-11-01 09:14 GMT

ఏపీ సీఎం జగన్‌కు సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగతంగా తాను హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సీబీఐ కోర్టు... తాజా తీర్పును వెల్లడించింది. ఆస్తుల కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరువుతున్న జగన్.. ఏపీ సీఎంగా పరిపాలనపై దృష్టి పెట్టాల్సి ఉందని.. హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషన్‌ వేశారు. ఐతే.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడాన్ని సీబీఐ వ్యతిరేకించింది. సీబీఐ వాదనతో ఏకీభవించిన సీబీఐ కోర్టు జగన్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

జగన్‌కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడంవల్ల అతని కేసులు, సాక్షులపై ప్రభావం చూపే అవకాశం ఉందని కోర్టుకు సీబీఐ వాదనలు వినిపించింది. జగన్ గతంలో ఎంపీగా ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని తెలిపింది. జగన్‌ ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని.. అధికారులంతా ఆయన చెప్పినట్లు వినాల్సి ఉంటుందని.. ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని సీబీఐ.. కోర్టు దృష్టికి తీసుకువచ్చింది.

అప్పటికీ, ఇప్పటికీ కేవలం పరిస్థితులు మాత్రమే మారాయి తప్పా నేరంలో ఎలాంటి మార్పు జరగలేదన్న విషయాన్ని సీబీఐ.. కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినవారికి ఎలాంటి మినహాయింపులు ఇవ్వవద్దన్న సుప్రీం కోర్టు సూచనను సీబీఐ.. న్యాయస్థానం ముందుంచింది. మరోవైపు జగన్ ఏపీ సీఎంగా ఉన్నందువల్ల ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని.. జగన్ ప్రతి వారం కోర్టుకు హాజరవడంవల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడే అవకాశం ఉందని.. ప్రజాపరిపాలన దృష్ట్యా ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది

Similar News