ప్రభుత్వ ఏర్పాటుపై మహారాష్ట్ర సస్పెన్స్ కంటిన్యూ..

Update: 2019-11-02 01:58 GMT

మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వచ్చి వారం రోజులు అవుతోంది. అయినా ఇంకా ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఎలాంటి అడుగులు పడటం లేదు. ఫిఫ్టీ ఫిఫ్టీ ప్రతిపాదనపై ఎవరికి వారు పట్టుదలకు పోతుండటంతో బీజేపీ-శివసేన మధ్య రోజురోజుకీ దూరం పెరిగిపోతోంది. దీంతో రెండు పార్టీలు కొత్త ఎత్తులు, ఊహించని పొత్తులు తెరపైకి వస్తున్నాయి.

288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 105 సీట్లతో సింగిల్ మెజారిటీ పార్టీగా నిలిచింది. దీంతో తామే సీఎం సీటు మీద కూర్చుంటామని పొత్తు పార్టీ శివసేనుకు డిప్యూటీ పోస్టు..13 మంత్రి పదవులు ఇస్తామంటోంది. బీజేపీ ప్రతిపాదనను తిరస్కరించిన శివసేన.. అనూహ్యంగా బీజేపీని పక్కన బెట్టి ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూకుడు పెంచుతోంది. ఇప్పటికే గవర్నర్ ను కలిసిన శివసేన నేతలు.. కొత్త పొత్తుల దిశగా అడుగులు వేస్తోంది. ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్తోంది.

బీజేపీకి అధికారం చిక్కకుండా శివసేనకు మద్దతునిచ్చే అంశంపై కాంగ్రెస్, శివసేన సీరియస్ గానే వర్కౌట్ చేస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులోని చిక్కులు, శివసేనకు మద్దతుపై మహారాష్ట్ర నేతలు ఢిల్లీకి క్యూ కట్టారు. పార్టీ అధిష్టానంతో సమావేశమై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

అటు ఎన్సీపీ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బీజేపీ-శివసేన కూటమి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పక్షంలో.. అవసరమైన మార్గాలను అన్వేషిస్తామని స్పష్టం చేసింది. మా దృష్టిలో అంటరాని పార్టీలంటూ ఏవీ లేవని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అయితే.. బీజేపీకి మాత్రం మద్దతు ఇవ్వబోమని క్లారిటీ ఇచ్చింది.

అధికార పంపంకంపై ప్రతిష్టంభన కొనసాగుతుండగానే మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ ఈనెల 5న ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్నాయి బీజేపీ వర్గాలు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం ఉంటుందని అంటున్నారు. శివసేన మద్దతు లేకున్నా.. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేసే బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేలు ప్రసాద్‌ లద్‌, చంద్రకాంత్‌ పాటిల్‌లకు అప్పగించారు.

అటు శివసేన మరింత దూకుడుగా వెళ్తోంది. శివసేన నేత సంజయ్ రౌత్ చేసిన ట్వీట్ మరింత చర్చకు దారి తీసింది. సాహిబ్.. మీ అహంకారం మా వద్ద చూపించకండి. అలెగ్జాండర్ వంటి ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు అని ట్వీట్ చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారింది. కచ్చితంగా శివసేన నాయకుడే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు. కావాలంటే రాస్కోండిని అన్నారు సంజయ్ రౌత్.

Similar News