రంగులు మారుతున్న మరాఠా రాజకీయం

Update: 2019-11-04 02:54 GMT

మరాఠా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సీఎం పీఠంపై శివసేన పట్టు వీడడం లేదు. ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెగేసి చెప్పింది. లేకపోతే తమ దారి తాము చూసుకుంటామని పునరుద్ఘాటించింది. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టంగా చెప్పేసింది. ఈ మేరకు పార్టీ అధికార పత్రిక సామ్నాలో సంపాదకీయం ప్రచురించింది. బీజేపీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీలో బలం నిరూపించుకోవడంలో విఫలమైతే తామే రంగంలోకి దిగుతామని శివసేన తెలిపింది. ఎన్సీపీ, కాంగ్రెస్‌, ఇతర ఎమ్మెల్యేలతో కలిపి తమ బలం 170కు చేరుతుందని పేర్కొంది. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ సిద్ధాంతాలు వేరైనప్పటికీ.. ప్రభుత్వాన్ని సమన్వయంతో నడిపించడానికి అవసరమైన ప్లాన్‌తో ముందుకు వెళ్తామని వివరించింది. మాజీ ప్రధాని వాజ్‌పేయ్ తరహాలోనే తాము కూడా అందరినీ కలుపుకుంటామని వెల్లడించింది. మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాల కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని తెలిపింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా రాష్ట్రపతి పాలన విధిస్తే అది బీజేపీకి అతిపెద్ద ఓటమిగా మిగిలిపోతుందని హెచ్చరించింది.

ఇదిలా ఉంటే, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అని అంటారు. మహారాష్ట్ర పాలిటిక్స్ కూడా అందుకు మినహాయింపు కాదు. మరాఠా గడ్డపై రాజకీయ రంగులు మారుతున్నా యి. శివసేనతో చర్చలు జరపడానికి ఎన్సీపీ సిద్ధమవుతోంది. శివసేన నాయకులతో మాట్లాడతామని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో తాజా పరిణామాలు, ప్రభుత్వ ఏర్పాటు సహా కీలకాంశాలపై చర్చిస్తామని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్సీపీ అగ్రనేత అజిత్ పవార్‌కు, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఫోన్ చేశారు. ఆ సమయంలో ఆయన అందుబాటులో లేరు. సంజయ్ రౌత్ తనకు ఎందుకు ఫోన్ చేశారో తెలీదని, తాను మళ్లీ ఫోన్ చేసి వివరాలు కనుక్కుంటానని అజిత్ పవార్ తెలిపారు.

మరాఠా ముచ్చట్లలోకి రాజ్‌ఠాక్రే ఆధ్వర్యంలో MNS పార్టీ ఎంట్రీ ఇచ్చింది. MNS అధినేత రాజ్‌ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. 10 నిమిషాల పాటు వారిద్దరూ సమావేశమ్యయారని ఎంఎన్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్‌ఎస్ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. ఐతే ప్రభుత్వ ఏర్పాటులో ఒక్క సీటు కూడా కీలకమే అవుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ నాయకత్వం మాత్రం గుంభనంగా వ్యవహరిస్తోంది. ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో మాట్లాడి తాజా పరిణామాలపై సమాలోచనలు జరిపారు.

మరోవైపు, బీజేపీ నాయకత్వం ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తోంది. తొందరపడి నిర్ణయం తీసుకోకుండా పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలని మహారాష్ట్ర బీజేపీ నాయకులకు పార్టీ నాయకత్వం సూచించింది.

Similar News