పుష్పయాగానికి సిద్ధమైన శ్రీవారు

Update: 2019-11-04 01:45 GMT

తిరుమల క్షేత్రం స్వామివారికి పుష్పయాగం నిర్వహించేందుకు సిద్ధమైంది. ఆలయ ప్రాంగణాన్ని పూలతో ఆలంకరించారు. ఏటా కార్తీకమాసంలో శ్రావణ నక్షత్ర పర్వదినాన పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పుష్పయాగం కోసం.. టీటీడీ ఉద్యానవన విభాగం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పుష్పాలు సేకరిస్తుంది.

తిరుమల వేంకటేశ్వరుడు అలంకారప్రియుడు. నిత్యం శ్రీవారిని రకరకాల పూలతో అలంకరిస్తారు. మేలుకొలుపు నుంచి పవళింపు సేవ వరకు స్వామివారిని పుష్పాలతో సుందరంగా ముస్తాబు చేస్తారు. సర్వాలంకారభూషితుడైన దేవదేవున్ని చూడడానికి రెండు కళ్లూ సరిపోవు. ఆ ముచ్చట తీర్చడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది. శ్రీదేవి-భూ దేవీ సమేతుడైన శ్రీనివాసునికి పుష్పయాగం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అలంకార ప్రియుడైన స్వామివారికి బిల్వపత్రంతో హోమాలు నిర్వహించడంతో పాటు ఉత్సవమూర్తి కంఠం వరకు పుష్ప సమర్పణ వైభవంగా జరుగుతుంది.

ఏటా కార్తీకమాసంలో శ్రావణ నక్షత్ర పర్వదినాన పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ సోమవారం శ్రీవారికి పుష్పయాగం నిర్వహించనున్నారు. ఆలయంలో రెండవ అర్చన, రెండో గంట, నైవేద్యం తర్వాత మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేస్తారు. తరువాత పాలు, పెరుగు, తేనే, చందనం, పసుపు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. స్వామివారికి తులసిమాల అలంకరిస్తారు. అనంతరం సహస్రధారాభిషేకం జరుపుతారు. విష్ణుగాయత్రి మంత్రంతో 108 సార్లు బిల్వపత్ర హోమం జరుగుతుంది. ఆ తర్వాత 12 సార్లు పుష్పాధిపతికి సంబంధించిన హోమం నిర్వహిస్తారు.

తిరుమల క్షేత్రంపై పుష్పయాగం వేడుక నేత్రపర్వంగా సాగుతుంది. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో 7 టన్నుల పుష్పాలను ఉపయోగిస్తారు. 12 రకాలైన సంప్రదాయ పువ్వులతో పాటు 7 రకాల పత్రాలను నివేదిస్తారు. 20 సార్లు పుష్పార్చన జరుగుతుంది. ఉత్సవమూర్తులకు హారతి సమర్పణతో పుష్పయాగం ముగుస్తుందని టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు తెలిపారు.

పుష్పయాగం తర్వాత ఉత్సవమూర్తులు తిరుమాడ వీధుల్లో విహరిస్తారు. సహస్రదీపాలంకార సేవ తరువాత మలయప్పస్వా మి, ఆలయ నాగమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. పూర్వం రోజుల్లో బ్రహ్మోత్సవాల సమయంలో పుష్పయాగం నిర్వహించేవారట. ధ్వజారోహణ జరిగిన ఏడో రోజున శ్రీ వారికి పుష్పోత్సవం జరిపేవారట. దేశం సస్యశ్యామలంగా-సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షతో 15వ శతాబ్దంలో ఈ కార్య క్రమం ప్రారంభమైందని చరిత్ర చెబుతోంది. తరువాత కొన్ని కారణాల వల్ల పుష్పయాగం నిలిచిపోయింది. 1980 నవంబర్ 14న టీడీపీ మళ్లీ పుష్పయాగాన్ని ప్రారంభించింది.

Similar News