తెలుగు రాష్ట్రాలపై స్వైన్ ఫ్లూ మహమ్మారి మళ్లీ పంజా విసురుతుంది. చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుతుండడంతో స్వైన్ ఫ్లూ కారక వైరస్ విజృంభిస్తుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ కేసుల నమోదు సంఖ్య రోజురోజుకు పెరుగుతూ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. గత 6వారాల్లోనే 28 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారంటే ప్ల్యూ స్వైరవిహారం ఏరేంజ్‌లో ఉందో అర్దం చేసుకోవచ్చు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1325 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా అందులో 21 మందిని మృత్యువాత పడ్డారు. ఈ గణాంకాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను కలవరానికి గురి చేస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ ప్రభావం హైదరాబాద్‌లో ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ఒక్క హైదరాబాద్‌లోనే 680 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అయ్యాయి. అందులో ఏడుగురు ఈ మహ్మమారి బారినపడి చనిపోయారు. తర్వాత స్థానాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే భాగ్యనగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో స్వైన్ ఫ్లూ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల తెలుగు రాష్రాల్లో భారీ వర్షాల కారణంగా వాతావరణంలో జరిగిన మార్పుల ప్రభావం వైరస్ విజృంభనకు కారణం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రోజుకు సుమారు 60మంది వరకు నమూనాలను పరీక్షిస్తుండగా సగటున 16శాతం కేసులు నమోదు అవుతున్నాయి.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు విష జ్వరాలతో అల్లాడుతున్నాయి. దీనికి తోటు ఇప్పుడు స్వైన్ ఫ్లూ వైరస్ విజృంభనతో.. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సాధారణ వైరల్ లక్షణాలు, స్వైన్ ఫ్లూ లక్షణాలు దగ్గర దగ్గరగా ఉండడంతో ఆసుపత్రులకు బాధితులు పరగులు తీస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్లో ఈ తరహా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చలికాలంలో స్వైన్ ఫ్లూ వైరస్ బాగా వృద్ధి చెందే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంపై ముందస్తుగా చర్యలు తీసుకోకపోతే డెంగీ తరహాలో స్వైన్ ఫ్లూ కూడా ప్రజారోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెట్టే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. వైరస్‌ను నిలువరించడానికి ముఖ్యంగా ప్రజల్లో విస్తృతంగా అవగాహన కాల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు.