చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో సోమవారం టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముందుగా కోడెల శివప్రసాద్‌కి నివాళలర్పించడంతోపాటు గోదావరి బోటు ప్రమాద మృతులకు సంతాపం ప్రకటించనున్నారు. అనంతరం 12 అంశాలపై చర్చతోపాటు పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. సంస్థాగత ఎన్నికలు నిర్వహించి అక్కడి నుంచి పార్టీని మరింత దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతి కమిటీలో బలహీన వర్గాలకు పెద్ద పీట వేయనున్నారు. సామాజిక వర్గాల జనాభా ఆధారంగా వారికి పదవులలో అవకాశాలు ఇవ్వనున్నారు.
ఇక కార్యవర్గంలోకి ఎన్నికైన వారి పనితీరును నిర్ణీత సమయంలోగా పరిశీలించనున్నారు. పనితీరు సరిగాలేని వారిని కార్యవర్గంలోని మెజార్టీ సభ్యుల నిర్ణయంతో రీకాల్ చేయాలనే కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 1991లో చంద్రబాబు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో ఎలాంటి విధానం అమలైందో దానినే తిరిగి పునరుద్ధరించనున్నారు.
కార్యకర్తలు, నేతల ఆర్థిక మూలలు దెబ్బతీసేలా వైసీపీ చేస్తోన్న అప్రజాస్వామిక చర్యలను ఎదుర్కొనే విధంగా చర్చించనున్నారు. ప్రభుత్వతీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న వివిధ ప్రజా సంఘాలకు మద్దతు తెలుపుతూ వారి తరపున పోరాటం చేసే దిశగా కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ సమావేశంలో.. ఇసుక కొరత, భవన కార్మికుల ఆత్మహత్యలతో సహా పలు అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.