ఏపీలో బుధవారం పలు చోట్ల ఏసీబీ దాడులు జరిగాయి. విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారి మురళీ గౌడ్ ఇళ్లపై దాడులు చేశారు ఏసీబీ అధికారులు. విజయవాడ సహా తిరుపతి, కర్నూలు, బెంగళూరులోని ఆయన ఇళ్లు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేశారు. 1993లో టెక్నికల్ అసిస్టెంట్‌గా బాధ్యతలు చేపట్టిన మురళీగౌడ్ అనతికాలంలోనే పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది.
అటు.. కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ ఏఎస్‌ఐ గుణ్ణం వీర వెంకటసత్యనారాయణ చౌదరి ఇళ్లపైనా దాడులు చేశారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో ఏసీబీ సోదాలు చేస్తున్నారు. కాకినాడ, రావులపాలెంలో నాలుగు ప్రాంతాలతో పాటు సామర్లకోటలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఏసీబీ సోదాల్లో దాదాపు కిలోన్నర బంగారు ఆభరాణాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు కాకినాడలో 4 భవనాలు, 5 ఖాళీ స్థలాలు, వ్యవసాయభూములకు సంబంధించి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాంసరీ నోట్లు సైతం లభ్యమయ్యాయి.