టీడీపీలో సమూల మార్పులు చేయాలని నిర్ణయించిన చంద్రబాబు

Update: 2019-11-06 04:57 GMT

మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడ్డ తమ్ముళ్లను తిరిగి ట్రాక్‌ ఎక్కించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఓటమి కారణాలను తెలుసుకున్న చంద్రబాబు పార్టీలో సమూల మార్పులు చేయాలని నిర్ణయించారు. గ్రామ స్థాయి నుంచి అన్ని కమిటీలను, పార్టీ అనుబంధ విభాగాలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి కొత్త కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఎన్నికల కమిటీ పరిశీలకులతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. వారికి స్పెషల్‌ క్లాస్‌ తీసుకున్నారు. గ్రామ, వార్డు, మండల, జిల్లా కమిటీల్లోకి తీసుకుంటున్న వారికి ఎలాంటి అర్హతలు ఉండాలి, పైరవీలకు తావు లేకుండా ఎలా నూతన కమిటీలు వేయాలనే దానిపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

ఓటమితో డీలాపడ్డ పార్టీని తిరిగి గాడిలోకి తీసుకురావాలంటే మార్పులు అవసరమని భావించిన చంద్రబాబు.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీలోని అన్ని కమిటీల్లో యువత 33 శాతం, మహిళలు 33 శాతం, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు 50 శాతం ఉండాలనేది చంద్రబాబు తీసుకున్న నిర్ణయం.. తాజా సమావేశంలోనూ పార్టీ ఎన్నికల పరిశీలకులకు చంద్రబాబు ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. రెండు నెలల్లో అన్ని కమిటీలను పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. పార్టీకి అనుబంధ విభాగాలుగా ఉన్న వాటికి నూతన అధ్యక్షులను, నూతన కమిటీని నియమించాలని చంద్రబాబు సూచించారు. ఎవరో చెప్పారని కమిటీలోకి ఎవరిని పడితే వారిని తీసుకోకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని తీసుకోవాలని సూచించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎదురైన సంఘటనలు, ప్రజా సమస్యలపై టీడీపీ చేసిన పోరాటాలు, పార్టీ చరిత్ర ఏంటనేది ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని ఎన్నికల పరిశీలకులకు చంద్రబాబు స్పష్టం చేశారు. రెండు నెలల్లోపు పార్టీ ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని దిశానిర్దేశం చేశారు.

మొత్తంగా పార్టీలో కొత్త రక్తాన్ని ఎక్కించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో సీనియర్‌ నేతల్లో గుబులు మొదలైంది. ఎక్కడ తమ పదవులు కొత్త వారికి వెళ్తాయోనన్న టెన్షన్‌ సీనియర్స్‌ను వెంటాడుతోంది.

Similar News