కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్న కాంగ్రెస్ పార్టీ.. వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. ఇందులో భాగంగా రాష్ట్రాల వారీగా ఏఐసీసీ ప్రతినిధులు పర్యటిస్తూ బీజేపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు సోనియాగాంధీ ఆదేశాలతో దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు ఆజాద్ తెలిపారు. హైదరాబాద్ వచ్చిన ఆజాద్.. గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌నేతలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. 50 వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదన్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం భాదాకరమన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అటు తహసీల్దార్ విజయారెడ్డి హత్య హేయమైన చర్య అన్న ఆజాద్.. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక బీజేపీ వైఫల్యాలపై దేశంలో 650 జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
మరోవైపు ఈనెల 15 వరకు వరకు చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు ఆజాద్. డిసెంబర్‌లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. స్థానిక నాయకుల మధ్య విభేదాలు లేవని అంతా కలిసికట్టుగా ఉన్నారని అన్నారు. ఆ తర్వాత గాంధీభవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నాయకుల కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.. కర్నాటక మాజీ మంత్రి హెచ్‌కే పాటిల్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.. రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో ఈనెల 15 వరకు చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై చర్చించారు. అధిష్ఠానం పిలుపు మేరకు చేపడుతున్న కార్యక్రమాలు కావడంతో సీరియస్‌గా తీసుకోవాలని రాష్ట్ర నేతలకు సూచించారు. ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాలు నిర్వహించాలని.. 8న కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలు చేపట్టేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. డీసీసీ అధ్యక్షులు లేని జిల్లాల్లో కార్యక్రమాల నిర్వహణకు పీసీసీ కార్యవర్గ సభ్యులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. అన్ని స్థాయిల నేతలను, కార్యకర్తలను కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని పాటిల్ పార్టీ నేతలకు సూచించారు.