చుట్టు మంచు పర్వతాలు, స్వచ్ఛమైన నీరు ప్రవహించే నదులు, ఆహ్లాదాన్ని పంచే సరస్సులు. ప్రకృతి రమణీయతకు పుట్టిల్లుగా చెప్పుకునే కశ్మీరం అందాలు పర్యాటకులను ముగ్థుల్ని చేస్తుంది. అందుకే తుపాకుల మోతలు, ఉగ్రవాదుల బాంబు దాడులను కూడా లెక్క చేయకుండా తనవైపు టూరిస్టులను ఆకర్షిస్తుంది కశ్మీర్.
కానీ, ఇప్పుడు కశ్మీర్ లో పరిస్థితి మారిపోయింది. పర్యాటకులతో కళకళలాడిన ప్రాంతాలన్ని జనం లేక బోసి పోతున్నాయి. దాల్ సరస్సులో హౌజ్ బోట్లు కదలటం లేదు. జమ్ము కశ్మీర్ ప్రజలకి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో జమ్ముకాశ్మీర్ పర్యాటక రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్రంలో అనిశ్చితి పెరగడంతో పాటు అక్టోబర్ నుండి స్థానికేతరులపై దాడులు పెరిగాయి. పలు ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతుండటంతో పర్యాటకుల సంఖ్య గతంలో కంటే తగ్గింది. గత మూడు నెలల్లో దేశ, విదేశీ పర్యాటకులు కేవలం 20 వేల మంది మాత్రమే కాశ్మీర్‌ను సందర్శించారు. గతేడాది ఇదే సీజన్లో 2,28,905 మంది పర్యాటకులు కాశ్మీర్‌ను సందర్శించారని పర్యాటకశాఖ లెక్కలు చెబుతున్నాయి.
టూరిస్టుల సంఖ్య తగ్గిపోవటంతో పర్యాటకులపై ఆధారపడే హోటళ్లు, రవాణా రంగం, హౌస్ బోట్లతో పాటు అన్ని వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయి. నిషేధాలు అమల్లో ఉన్నా మూడు నెలల్లో 1,373 మంది విదేశీయులతో పాటు 8,404 మంది పర్యాటకులు లోయను సందర్శించారని రాష్ట్ర పర్యాటక శాఖ పేర్కొంది. అక్టోబర్ 9న ప్రభుత్వం పర్యాటకులపై నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాత ఇప్పటివరకు కేవలం 9,327 దేశీయ పర్యాటకులతో పాటు 824 మంది విదేశీయులు కశ్మీర్ లో సందర్శించారు.