తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు తిరిగి ఆలయ ప్రవేశానికి మార్గం సుగమమైంది. సుమారు ఏడాదిన్నర విరామం తర్వాత ఆయన శ్రీవారి కైంకర్యాల్లో పాల్గొననున్నారు. రమణ దీక్షితులను ఆగమ శాస్ర్త సలహామండలి సభ్యుడిగా నియమిస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. గత పాలక మండలి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా జీవో విడుదల అయిన అనంతరం.. ఆయన ధర్మారెడ్డిని కలిశారు.
అటు రమణదీక్షితులకు శ్రీవారి కైంకర్యాలు నిర్వహించేందుకు కూడా టీటీడీ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆయన కుమారులు వెంకట కుమార దీక్షితులు, రాజేష్ దీక్షితులను గోవిందరాజ స్వామి ఆలయం నుంచి తిరుమల శ్రీవారి ఆలయానికి బదిలీ చేశారు. రమణ దీక్షితులతో పాటు ఉద్యోగ విరమణ చేసిన నలుగురికి కూడా శ్రీవారి ఆలయంలో పునప్రవేశం కల్పించింది. అయితే కోర్టు కేసుల పరిష్కారం తర్వాత రమణ దీక్షితులకు పూర్తిస్థాయిలో అర్చకత్వ బాధ్యతలు కూడా అప్పగించాలని టీటీడీ నిర్ణయించినట్టు సమాచారం. ఇటీవల ప్రభుత్వం దేవాదాయశాఖ జీవో విడుదల చేసింది.
గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి ఆలయ అర్చకులకు ఉద్యోగ విరమణ నిబంధనలను వర్తింపజేయడంతో రమణ దీక్షితులు ప్రధాన అర్చకుడి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా టీటీడీలో అరాచకాలు జరిగాయని ఆరోపణలు చేయడంతోపాటు స్వామివారి వజ్రాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. పోటులో తవ్వకాలు జరిపారని చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. దీంతో గత ప్రభుత్వం ఆయనపై పరువు నష్టం దావా కూడా వేసింది.
రమణ దీక్షితులు.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. టీటీడీ ప్రధాన అర్చకుడిగా తిరుమల వెంకటేశ్వరుడి సన్నిధిలో సుధీర్ఘకాలంగా సేవలు అందించారు. టీడీపీ సర్కార్ హయాంలో రిటైర్మెంట్ నిబంధనతో దీక్షితులు టీటీడీకి దూరమయ్యారు. తర్వాత జరిగిన వివాదాలు, కోర్టుల్లో పిటిషన్లు వేసినా ఆయనకు ఊరట దొరకలేదు. గతంలో ఆయన జగన్ ను కలిసి... మద్దతు కోరారు. కేంద్రం పెద్దలను కూడా కలిశారు. గతంలో జగన్ ఇచ్చిన హామీ మేరకు దీక్షితుల్ని ఆగమ సలహా కమిటీ సభ్యుడిగా తాజాగా నియమించారు.