సీఎం పీఠం కోసం అటు బీజేపీ, ఇటు శివసేన పట్టు వీడకపోవడంంతో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఇవాల్టితో గడువు కూడా ముగుస్తోంది. దీంతో ఎవరు అధికారంలోకి వస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరోవైపు క్యాంపు రాజకీయాలు సైతం మొదలయ్యాయి. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో శివసేనలో విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. బీజేపీతో అధికారాన్ని పంచుకోవడంపై శివసేన రెండుగా చీలినట్లు తెలుస్తోంది. ఓ గ్రూప్ ప్రస్తుత సంక్షోభానికి ముగింపు పలకాలని డిమాండ్ చేస్తుండగా, మరో వర్గం 50-50 ఫార్మూలాకు పట్టుబడు తోంది..
ఎమ్మెల్యేల్లో విభేదాలు రావడంతో శివసేన నాయకత్వం అప్రమత్తమైంది. తమ ఎమ్మెల్యేలను హోటల్‌కు తరలించింది. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీపై శివసేన తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అటు బీజేపీ నేతలు గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీని కలిశారు. తాజా పరిణామాలు, ప్రభుత్వ ఏర్పాటు చర్చించారు. అతిపెద్దపార్టీగా అవతరించినందున తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వా నించాలని కోరారు. దీనిపై అడ్వకేట్ జనరల్ నుంచి గవర్నర్ న్యాయ సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ కొనసాగుతారని తేల్చి చెప్పారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నట్టు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయం వెలువడుతుందన్నారు. అక్టోబర్ 24న మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటికీ 14 రోజులవుతోంది. కానీ అధికార ఏర్పాటుపై స్పష్టత రాలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశముంది.