ఢిల్లీ కాలుష్యం.. టూరిజంపై ఎఫెక్ట్ చూపుతోంది. నిత్యం వేలాదిగా వచ్చే పర్యాటకులు.. ఇప్పుడు రాజధాని ముఖం చూడటం లేదు. అంతేకాదు నగర వాసులు సైతం ఢిల్లీ వదిలి పోతున్నారు. స్కూల్స్ సెలవులు కూడా ఇవ్వడంతో వారంతా తట్టా బుట్టా సర్దుకుని.. ఇతర ప్రాంతాలకు విహారయాత్రకు పయనమవుతున్నారు. గడిచిన 10రోజులుగా నగరాన్ని కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ఎవరూ ఇక్కడ ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు. సాధ్యమైనంత వరకు విహార యాత్రలుకు, బంధువుల ఇళ్లకు, ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నారు.
అటు కాలుష్యంతో ఢిల్లీ టూరిజం మసక బారుతుంటే.. ఇతర పర్యాటక క్షేత్రాలు మాత్రం కళకళలాడుతున్నాయి. ఢిల్లీ వచ్చి అక్కడి నుంచి ఆగ్రా, జైపూర్ వంటి ప్రాంతాలను సందర్శించే పర్యాటకులు భారీగా తగ్గారు. విదేశాల నుంచి ఇదే సీజన్ లో పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. అయితే.. వీరంతా ఇప్పుడు ఇతర టూరిస్టు ప్రాంతాలకు వెళుతున్నారు. గోవాకు క్యూ కడుతున్నారు. తీర ప్రాంతంలో కాలుష్యానికి దూరంగా ప్రశాంతంగా సాగర తీరంలో గడుపుతామంటున్నారు.
అటు ఢిల్లీ వాసులు సైతం సమీప ప్రాంతాల్లోని పర్యాటక క్షేత్రాలకు చేరుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే సిమ్లా పర్యాటకులతో కిటకిటలాడుతోంది. ఐటీ నిపుణులు, ఇతర ఉద్యోగులు కుటుంబ సభ్యులతో సహా హిల్ స్టేషన్ కు చేరుకుంటున్నారు. ఢిల్లీలో కాలుష్యం నుంచి బయటపడి.. ప్రశాంత హిమాలయాల్లో సేద తీరుతున్నారు. దీంతో అనూహ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో టూరిస్టు ప్రాంతాలకు డిమాండ్ పెరిగింది.