అనుమానాలకు శుభంకార్డు వేసిన రజనీకాంత్

Update: 2019-11-09 12:42 GMT

తమిళనాట రజనీకాంత్‌ రాజకీయ పార్టీ పెడతారనే ఊహాగానాలు మొదలైనప్పటి నుంచీ... ఆయన కాషాయ మనిషంటూ ప్రచారం జరిగింది. బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారనే ఊహాగానాలు కొద్ది రోజులుగా పెరిగిపోయాయి. అందరి అనుమానాలకు శుభంకార్డు వేసే ప్రయత్నం చేశారు రజనీకాంత్. బీజేపీ ట్రాప్‌లో తాను పడనంటూ కుండబద్ధలు కొట్టారాయన.

రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నూతన కార్యాలయ ప్రాంగణంలో ప్రముఖ దర్శకుడు బాలచందర్ విగ్రహ ఆవిష్కరణలో రజినీ పాల్గొన్నారు. తోటి నటుడు, MNM అధినేత కమల్‌హాసన్‌తో కలిసి ఒకే వేదికపై మెరిశారు.

తంజావూర్‌లో ప్రముఖ రచయిత తిరువళ్లవర్‌ విగ్రహానికి హిందూ మక్కల్ కచ్చి నేత కాషాయవస్త్రం కట్టి, రుద్రాక్షమాల వేయడం వివాదం రాజేసింది. దానిపై రజనీ స్పందన కోరగా.. బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. తనకు కాషాయ రంగు పులమాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు.

తలైవా పొలిటికల్ డైలాగ్‌కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కమలనాథులు. ఆయన కాషాయ తీర్థం పుచ్చుకుంటారని కానీ, బీజేపీతో కలిసి సాగుతారని కానీ ఎప్పుడూ చెప్పలేదని తమిళనాడు బీజేపీ ఇంఛార్జ్‌ మురళీధర్‌రావు అన్నారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది తమ పార్టీలో చేరుతున్నారని గుర్తుచేశారు.

మాస్‌ కథలతో బాక్సాఫీస్ బద్దలుకొట్టే రజనీకాంత్‌కు భక్తి ఎక్కువ. ఆధ్యాత్మిక రాజకీయాలు చేస్తానంటూ గతంలో చెప్పారాయన. దీంతో ఆయన బీజేపీ మిత్రుడంటూ కొన్ని పార్టీలు ప్రచారం మొదలుపెట్టాయి. రజనీ వ్యాఖ్యలతో అవన్నీ ఉత్తుత్తివేనని తేలిపోయాయి. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా.. ప్రజలు సంయమనం పాటించాలని తలైవా సూచించారు.

Similar News