నవంబర్ 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. గతంలో సరాసరి ఇసుక డిమాండ్ 80వేల టన్నులు ఉండేదని.. వరదలు, రీచ్‌లు మునిగిపోయిన కారణంగా ఈ డిమాండ్‌ను చేరుకోలేకపోయామన్నారు. అయితే, గత వారం రోజులుగా ఈ పరిస్థితి మెరుగుపడిందన్నారు జగన్. రీచ్‌ల సంఖ్య సుమారు 60 నుంచి 90కి పెరిగాయన్న సీఎం.. వచ్చే వారంలోగా 1.2 లక్షల టన్నులను 2 లక్షల టన్నులకు పెంచాలని అధికారులకు సూచించారు.
137 నుంచి 180 వరకూ స్టాక్ పాయింట్లను పెంచాలని.. అదే విధంగా నియోజకవర్గాల వారీగా రేట్ కార్డులను ప్రకటించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ఇసుక కొరత తీరేంత వరకు ఎవరూ కూడా సెలవులు తీసుకోకూడదన్నారు. ఎవరైనా ఇసుకను అక్రమ రవాణా చేసినా.. ఎక్కువ ధరకు అమ్మినా జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామన్నారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్.