మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. మంగళవారం రాత్రికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వమా? రాష్ట్రపతి పాలనా అన్నది తేలనుంది. ప్రభుత్వ ఏర్పాటులో పార్టీలు విఫలమవుతున్నాయి. బీజేపీ చేతులెత్తేయగా.. అవకాశం వచ్చినా.. ఎన్సీపీ, కాంగ్రెస్ ను ఒప్పించలేక శివసేన విఫలమైంది. దీంతో మూడో పెద్ద పార్టీగా ఉన్న NCPని ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ ఆహ్వానించారు. ఎన్సీపీకి మంగళవారం రాత్రి 8.30గంటల వరకు గవర్నర్ గడువు ఇచ్చారు. ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమికి కలిసి 98 స్థానాలున్నాయి. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు 47 సీట్ల దూరంలో నిలిచిపోతుంది. సీఎం పీఠంపై పట్టుదలగా ఉన్న శివసేన వీరికి మద్దతు ఇస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.