పూటకో మలుపు.. రోజుకో ట్విస్ట్.. మహారాష్ట్రలో రాజకీయం క్షణక్షణానికీ మారిపోతోంది. ప్రజలు ఇచ్చిన భిన్నమైన తీర్పుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక బీజేపీ సహా పార్టీలన్నీ మల్లగుల్లాలు పడుతున్నాయి. మొదట శివసేన మద్దతిస్తుందన్న ఆశతో బీజేపీ బలపరీక్షకు సిద్ధపడినా.. ఆ తర్వాత పరిణామాలు బీజేపీని వెనక్కు తగ్గేలా చేశాయి. బీజేపీ రేసు నుంచి తప్పుకోవడంతో శివసేన సీన్‌లోకి వచ్చింది. ఆ తర్వాత మహా వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇప్పుడు మళ్లీ ఎన్సీపీ లైన్‌లోకి వచ్చింది. గవర్నర్ ఆహ్వానించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ పావులు కదుపుతోంది.
బలపరీక్ష నుంచి బీజేపీ తప్పుకున్న తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ కొంత సమయం కావాలని గవర్నర్‌ను కోరింది. ఆదివారం నుంచే ఇటు ఎన్సీపీతో, అటు కాంగ్రెస్‌తో చర్చలు జరిపిన శివసేన గడువు సమీపిస్తున్నా ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వకలేకపోయింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యా బలం తమకు ఉందని శివసేన నేతలు ఏక్‌నాథ్ షిండే, ఆదిత్య థాక్రేలు చెప్పినా.. దానికి సంబంధించిన లేఖలు మాత్రం ఇన్‌టైమ్‌లో ఇవ్వలేకపోయారు. మద్దతు లేఖ ఇచ్చేందుకు 48 గంటల సమయం కావాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే, శివసేన అభ్యర్థనను గవర్నర్ సున్నితంగా తిరస్కరించారు. డెడ్‌లైన్‌ను పొడిగించలేమని స్పష్టం చేశారు. దీంతో బీజేపీ సపోర్ట్ లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీరాలు పలికిన శివసేనకు గవర్నర్ నిర్ణయం ఝలక్ ఇచ్చినట్లయింది.
ఇదిలా ఉంటే, ఉదయం నుంచి ఇటు ముంబైలో, అటు ఢిల్లీలో హాట్ హాట్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముంబై, ఢిల్లీల్లో వరుస భేటీలు జరిగాయి. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన-ఎన్సీపీలు చర్చలు జరిపాయి. రెండు పార్టీల అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే-శరద్ పవార్‌లు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటు, బల నిరూపణ, కాంగ్రెస్ పార్టీ మద్దతు, పదవుల కేటాయింపుపై మంతనాలు జరిపారు. బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడడంలో పరస్పరం సహకరించుకోవాలని తీర్మానించారు. అంతకుముందు, శివసేన ఎమ్మెల్యేలతో ఉద్ధవ్ ఠాక్రే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇప్పటివరకు అంతా ఒక్కతాటిపై ఉన్నామని, ఇకపై కూడా అలాగే ఉండాలని కోరారు. పోరాటం చేయడం శివసేనకు కొత్తదేమీ కాదన్నారు. అటు ఎన్సీపీ ఎమ్మెల్యేలతో శరద్ పవార్ సమావేశం నిర్వహించారు. చర్చలు సుదీర్ఘంగా సాగినప్పటికీ ఎలాంటి నిర్ణయమూ వెలువడలేదు. దీంతో బీజేపీయేతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనకున్న శివసేనకు చుక్కెదురైంది.
ఇక ప్రభుత్వ ఏర్పాటులో శివసేన విఫలం కాడంతో మూడో అతిపెద్ద పార్టీ అయిన ఎన్సీపీని ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానించాల్సి వచ్చింది. ఎన్సీపీకి కూడా 24 గంటల డెడ్‌లైన్ పెట్టారు. గవర్నర్ నుంచి పిలుపురావడం ఆలస్యం.. ఎన్సీపీ నేతలు అజిత్ పవార్, ఛగన్ భుజ్బల్‌సహా ఇతర నేతలు హుటాహుటిన రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్‌ను కలిశారు.
మరోవైపు మంగళవారం రాత్రిలోగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ సుముఖత వ్యక్తం చేయాల్సి ఉంటుంది. బలాన్ని కూడా నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే తనకున్న ఎమ్మెల్యేలతోపాటు మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్, అలాగే తమ మద్దతు కోసం ప్రయత్నించిన శివసేన మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, కాంగ్రెస్, ఎన్సీపీకి శివసేన ఏమేరకు మద్దతిస్తుందన్నదానిపై సందేహం నెలకొంది. మొత్తంగా ఎన్సీపీ అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మంగళవారం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.