మహారాష్ట్రలో మహా నాటకం నడుస్తోంది. ఇక్కడి రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు రాజకీయాలకు అర్థాన్నే మార్చేస్తోంది. అధికారం కోసం నైతిక విలువలను కూడా పక్కన పెట్టేస్తున్నాయి. ఎన్నికలకు ముందు బీజేపీ- శివసేన కూటమిగా ఎన్నికలకు వెళ్లాయి. గత ఐదేళ్ల పాలనకు మద్దతు పలికి ప్రజలు కాషాయ కూటమికి అధికారం కట్టబెట్టారు. అయితే సీఎం సీటు రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టింది. 30 ఏళ్ల బంధాన్ని కూడా కాదనుకునేంతగా వారి మధ్య విభేదాలకు కారణమైంది. ఈ సారి ఎలాగైనా శివసైనికుడే సీఎం కావాలన్న పట్టుదలతో ఉన్న ఉద్ధవ్ సేన.. కమలం పార్టీకి కటీఫ్ చెప్పి.. బద్ధ విరోధులైన కాంగ్రెస్, ఎన్సీపీతో జట్టు కట్టేందుకు సిద్ధపడింది. ఇది ప్రజాస్వామ్యాన్ని, ఓటు వేసిన ప్రజలను అవమానించడమేనన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రజలు ఇచ్చిన తీర్పుకు భిన్నంగా శివసేనతో అధికారం పంచుకోవడానికి ఒకరు.. పరోక్ష సహకారానికి మరొకరు సిద్ధపడటం రాజకీయాలకు మరో అర్థాన్ని చెప్పినట్లయింది.
అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు ఏకమైనా.. శివసేన తలచిన దానికి భిన్నంగా పరిణామాలు మారిపోతున్నాయి. ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి మహా రాజకీయాలను మరో మలుపు తిప్పారు గవర్నర్. ఎన్సీపీకి 24 గంటల గడువు నిర్దేశించారు. ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుందన్నదే ఉత్కంఠ రేపుతోంది.
అటు ముఖ్యమంత్రి పీఠం ఖాయమనుకున్న శివసేన.. ఎన్సీపీ-కాంగ్రెస్‌కు చెరో డిప్యూటీ సీఎం పోస్టు ఇస్తామని ప్రతిపాదించింది. కావాలంటే స్పీకర్ పదవి కూడా భాగస్వామ్యపక్షాలకే ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్సీపీ పెట్టిన కండిషన్లకు ఒప్పుకుని ఎన్డీయే నుంచి శివసేన బయటకు కూడా వచ్చింది. ఇక ఎన్సీపీ, కాంగ్రెస్ సపోర్ట్‌తో పవర్‌లోకి రావచ్చని భావించినా చివరి నిమిషంలో కాంగ్రెస్ మోకాలడ్డటంతో శివసేనకు సీఎం సీటు దక్కకుండా పోయింది.
శివసేనకు బయటి నుంచి సపోర్టు ఇవ్వడంపైనా కాంగ్రెస్ నాయకత్వం సరైన నిర్ణయం తీసుకోలేకపోయింది. సేనకు మద్దతుపై పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండడంతో కాంగ్రెస్ హైకమాండ్ గందర గోళంలో పడింది. సీనియర్ నాయకులతో సోనియాగాంధీ జరిపిన చర్చల్లోనూ ఎలాంటి నిర్ణయం రాలేదు. దాంతో, ఎన్సీపీతో మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. తీవ్ర చర్చోప చర్చల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు కోసం శివసేనతో చేతులు కలపడానికే కాంగ్రెస్‌లో మెజార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపారు. మల్లికార్జున ఖర్గే, సంజయ్ నిరుపమ్ సహా పలువురు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ శివసేనతో చేతులు కలపడమే మంచిదని మెజార్టీ నేతలు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
కాంగ్రెస్ ఎటూ తేల్చకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం డైలమాలో పడింది. ఇదే సమయంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, ఈ ఎపిసోడ్‌లో కాంగ్రెస్ కీలకంగా మారగా.. శివసేన పరిస్థితి ఏంటన్నదే ప్రశ్న. మిత్ర పక్షాలుగా పోటీచేశాయి కాబట్టి ఇప్పుడు ఎన్సీపీకి కాంగ్రెస్ కచ్చితంగా మద్దతు ఇస్తుంది. ఎన్సీపీకి 54 సభ్యుల బలం ఉండగా.. కాంగ్రెస్‌కు 44 మంది సభ్యుల బలం ఉంది.. ఈరెండు పార్టీల కలయికతో బలం 98కి చేరుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 47 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది.. మరి, తనవంతు వచ్చిన సమయంలో మద్దతు ఇచ్చిన ఎన్సీపీకి శివసేన ఇప్పుడు మద్దతు ప్రకటిస్తుందా..? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్సీపీకి మద్దతివ్వడమంటే సీఎం సీటును వదులుకోవడమే అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలను శివసేన జీర్ణించుకోగలుగుతుందా..? చూడాలి.