ఇసుక కొరతపై చంద్రబాబు దీక్షకు సిద్ధమవుతున్నారు. ఈనెల 14న విజయవాడ వేదికగా 12 గంటలపాటు దీక్ష చేపట్టనున్నారు. ఐదు నెలలు గడిచినా ప్రభుత్వం ఇసుక కొరతను నివారించడంలో విఫలం అయిందని ప్రతిపక్ష నేత ఆరోపిస్తున్నారు. ఒక రోజు దీక్ష ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ దర్నా చౌక్‌లో నిర్వహించే ఈ దీక్షకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు, నేతలు హజరయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
మరోవైపు ఇతర రాజకీయ పార్టీల మద్దతు కోసం టీడీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజా బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసి దీక్షకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇసుక సమస్యపై ఎవరు దీక్ష చేసినా సంఘీబావం ఉంటుందన్న బీజేపీ చంద్రబాబు దీక్షకు కూడా సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించింది. అయితే స్వయంగా టీడీపీ దీక్షలో మాత్రం బీజేపీ నేతలు పాల్గొనబోరు. ప్రజా సమస్యలపై బీజేపీ ఒంటరిగానే పొరాటాలు చేస్తుందని ఆ పార్టీ స్పష్టం చేస్తోంది.
బీజేపీతో సంప్రదింపుల అనంతరం టీడీపీ నేతలు జనసేనతో చర్చలు జరిపారు. జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌తో టీడీపీ నేతలు ఫోన్‌లో మాట్లాడారు. దీక్షకు మద్దతు ఇవ్వాలని కోరారు. మంగళవారం పవన్ కల్యాణ్‌తోనూ తమ్ముళ్లు సమావేశం కాబోతున్నారు. పవన్ విశాఖలో చేసిన లాంగ్ మార్చ్‌కు టీడీపీ నేతలను పంపింది ఆ పార్టీ అధిష్టానం. దీంతో ఇప్పుడు తమ దీక్షకు కూడా మద్దతుగా ఉండాలని కోరనున్నారు.
మరోవైపు చంద్రబాబు కూడా ప్రజల మద్దతు కూడగట్టేపనిలో ఉన్నారు. తన దీక్షకు మద్దతివ్వాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇసుక కొరతతో నష్ట పోయిన కార్మికులు, వ్యాపారాలు కోల్పొయిన యజమానులు కూడా దీక్షలో భాగస్వాములు కావాలని లేఖ ద్వారా చంద్రబాబు కోరారు. పదుల సంఖ్యలో వృత్తి దారులు ఉపాధి కోల్పోయారని.. ఇప్పటికీ ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేల భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తాను చేస్తున్న దీక్షకు మద్దతుగా ఉండాలని చంద్రబాబు కోరారు.