మరో ముఖ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్న సీఎం జగన్

Update: 2019-11-12 01:40 GMT

మరో ముఖ్యమైన కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్‌ శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఈనెల 21న తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి.. మట్లపాలెం, ఉప్పలంకలో మినీ ఫిషింగ్‌ జెట్టీల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. మత్స్యకారులకు వేట నిషేధ నష్టపరిహారాన్ని అందజేస్తారు. మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ 9 రూపాయలకు పెంచే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పశువుల్లంక-సలాదివారిపాలెం వంతెనను సీఎం ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను మంత్రులు మోపిదేవి వెంకటరమణ, కన్నబాబు పరిశీలించారు. అధికారులతో కలిసి ఆయా ప్రాంతాలను సందర్శించారు.

గతంలో జీఎస్పీసీ గ్యాస్‌ అన్వేషణ కోసం 13 నెలలు సర్వే చేయడం వల్ల ముమ్మిడివరం నియోజకవర్గంలోని 16,780 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయిందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఉపాధి కల్పించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు మంత్రి చెప్పారు. అటు 90 కోట్ల రూపాయల వేట నిషేధ నష్టపరిహారాన్ని మత్స్యకారులకు ఇవ్వాల్సి ఉందన్నారు. నష్టపరిహారం కోసం ఓఎన్జీసీ, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని సీఎం జగన్‌ సంప్రదించారని.. ముమ్మిడివరం పర్యటనలో సీఎం ఆ పరిహారాన్ని బాధితులకు అందజేస్తారని మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పారు.

Similar News