అమరావతిలో ఏపీ కేబినెట్ సీఎం జగన్ అధ్యక్షతన రెండు గంటల పాటు పలు అంశాలపై చర్చించింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఇసుక సమస్య.. విపక్షాల విమర్శలు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన.. రైతు సమస్యలపై చర్చించారు. విజయనగరం, కర్నూలు జిల్లాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని నిర్ణయించారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం భొదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు మంత్రి పేర్ని నాని. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్లమాధ్యమం ప్రవేశపెడుతున్నట్టు స్పష్టం చేశారు. తెలుగు లేదా, ఉర్దూ ఒక భాషగా తప్పనిసరి చేయాలని నిర్ణయించామన్నారు.
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే రెండేళ్ల జైలు శిక్ష, రూ.2లక్షల జరిమానా విధించాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసిందన్నారు. వారం రోజుల్లో ఇసుక డిమాండ్‌ను గుర్తించి సరిపడా సరఫరా చేస్తమని చెప్పారు.
ఇక మొక్క జొన్న ధరలు పడిపోతుండటం పైనా కేబినెట్‌లో చర్చ జరిగిందన్నారు పేర్ని నాని. తక్షణమే చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారన్నారు. వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవాలని.. రైతులకు నష్టం రాకుండా కొనుగోళ్లు జరపాలని మార్కెటింగ్ శాఖకు జగన్ సూచించారు. చనిపోయిన మత్స్యకార కుటుంబాలకు వైఎస్ఆర్ భరోసా కింద 10 లక్షల రూపాయలు అందించాలని నిర్ణియించారు.