మహారాష్ట్రలో కొత్త వ్యూహాలు రచిస్తున్న బీజేపీ

Update: 2019-11-13 03:55 GMT

మహారాష్ట్ర పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ లో జరిగేదంతా తన మంచికే అనుకుంటోంది బీజేపీ. మద్దతు విషయంలో మొండికేసిన శివసేనకు బుద్ధి చెప్పేందుకు రెండు అడుగులు వెనక్కి తగ్గింది. ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించడంతో మళ్లీ వ్యూహాలకు పదును పెడుతోందని.. భవిష్యత్తులో ఎన్నికలొచ్చినా లేదా ప్రభుత్వ ఏర్పాటుకు మరో అవకావం ఇచ్చినా సత్తా చాటేలా గ్రౌండ్‌ వర్క్‌ ప్రిపేర్‌ చేసుకుంటోందని ముంబాయి పొలిటికల్ సర్కిల్ లో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.

తాజాగా జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో కమలనాథులు ఉన్నట్లుగా తెలుస్తోంది. తమతో మిత్రబంధాన్ని తెగతెంపులు చేసుకుని వెళ్లిపోయిన శివసేనను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టేందుకు పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించినా, బలనిరూపణకు గవర్నర్ అవకాశం ఇచ్చిన వదులుకుని.. జరుగుతున్న పరిణామాలను చూస్తూ కూర్చుంది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ మధ్య దోబూచులాటను నిశితంగా గమనించింది. ప్రభుత్వ ఏర్పాటులో శివసేన, ఎన్సీపీ విఫలం కావడంతో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. దీంతో ఇప్పుడు బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ శివసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కల్లే..! అటు ఎన్సీపీ-కాంగ్రెస్‌-శివసేన కూటమి కూడా పవర్‌లోకి రావడం గగనమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సైద్ధాంతికంగా శివసేన, కాంగ్రెస్‌ భిన్న ధ్రువాలు. ఈ రెండు పార్టీలకు పొసగదు.. పైగా ఎన్సీపీ-కాంగ్రెస్‌కు ప్రభుత్వ ఏర్పాటుపై అంత ఉత్సాహంగా కనిపించడం లేదు. కేవలం శివసేన ఒత్తిడితోనే ఎన్సీపీ మద్దతిచ్చేందుకు ముందుకొచ్చింది. చివరి నిమిషంలో కాంగ్రెస్‌ హ్యాండివ్వగా.. ఆ తర్వాత ఎన్సీపీ-కాంగ్రెస్‌ పక్షానికి శివసేన ఝలక్‌ ఇచ్చింది. జరగబోయే పరిణామాలన్నిటినీ ముందుగానే ఊహించిన బీజేపీ తమ ఛాన్స్‌ కోసం ఎదురుచూస్తూ ఉంది. చివరకు తాము ఆశించిన విధంగానే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన రావడంతో సరికొత్త వ్యూహాలకు సిద్ధమవుతోంది.

గతంతో పోలిస్తే ఈసారి బీజేపీ-శివసేన కూటమికి 11 సీట్లు తగ్గాయి. నిజానికి ఈ నష్టం జరిగింది శివసేన వల్లే. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి బీజేపీకి 2 శాతం ఓటింగ్ తగ్గితే.. శివసేనకు 3 శాతం ఓట్లు తగ్గాయి. ముంబై, థానే, కొంకణ్ ప్రాంతాల్లో తప్ప రాష్ట్రంలో పెద్దగా పట్టు కూడా లేదు. బీజేపీ 105 సీట్లు సాధిస్తే.. శివసేనకు అందులో సగం సీట్లు వచ్చాయి. అయినా అధికారంలో సగం కావాలంటూ షరతులతో దశాబ్దాల మైత్రి బంధాన్ని తెంపేసుకుంది. ఇదే మరాఠా గడ్డపై 1995 ఎన్నికల్లో శివసేనకు 73 సీట్లు..బీజేపీకి 65 సీట్లు వస్తే ఎలాంటి షరతులు లేకుండా సీఎం సీటుకు ఆశపడకుండా బీజేపీ సేనకు మద్దతునిచ్చింది. ఆ తర్వాత కూడా ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు.

అవును, రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.. మహారాష్ట్రలోనూ రాష్ట్రపతి పాలన తర్వాత కొత్త రాజకీయం మొదలైంది. అధికారం కోసం శివసేన ఎత్తులు వేస్తే.. ఆ ఎత్తులకు బీజేపీ ఇప్పుడు పై ఎత్తులు వేయాలనుకుంటోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మాజీ సీఎం ఫడ్నవిస్‌ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఫడ్నవిస్‌తోపాటు బీజేపీ ముఖ్యనేతలంతా ఇదే మాట చెబుతున్నారు.

అయితే, ఎవరి మద్దతుతో అనేది మాత్రం స్పష్టం చేయడం లేదు. దీంతో శివసేనకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌తో జత కట్టడం శివసేనలోని మరో వర్గానికి ఇష్టం లేనట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు శివసేన సై అన్న మరుక్షణమే ఆ వర్గం బీజేపీ గూటికి చేరే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తంగా ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ ఎలాంటి వ్యూహాలను అవలంబిస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది.

Similar News