విజయవాడ ధర్నాచౌక్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం 8 గంటలకు దీక్షకు కూర్చోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఇసుక సంక్షోభంపై రాత్రి 8గంటల వరకూ నిరసన తెలుపనున్నారు. ఇప్పటికే టీడీపీ శ్రేణులు రెండుసార్లు రాష్ట్రవ్యాప్తంగా ఇసుక సమస్యపై ఆందోళనలు నిర్వహించాయి. అటు విశాఖలో పవన్ కళ్యాణ్ తలపెట్టిన ర్యాలీకి మద్దతు కూడా తెలిపారు. ఇలా దశలవారీగా ప్రభుత్వం పోరాటాన్నిఉద్ధృతం చేస్తూ వచ్చిన చంద్రబాబు...గురువారం స్వయంగా రంగంలోకి దిగుతున్నారు..
అటు అధినేత చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు నేతలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా దీక్ష ఏర్పాట్లను పర్యవేక్షించారు. టార్గెట్లు పెట్టుకుని మరీ వైసీపీ నేతలు ఇసుకను దోచేస్తున్నారని మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికుల్లో భరోసా పెంచేందుకే దీక్ష చేపట్టినట్లు స్పష్టం చేశారు. కృత్రిమ కొరతను సృష్టించి... మాఫియా మాదిరిగా దోపిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యాపారాలు చేయాలన్నా, ఆస్తులు అమ్మాలన్నా ‘జే ట్యాక్స్’ కట్టాలా అంటూ దుయ్యబట్టారు. అటు విజయవాడ ధర్నాచౌక్‌లో ఏర్పాట్లను టీడీపీ నేతలు పరిశీలించారు.
దీక్షకు సంబంధించి ఇప్పటికే విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది టీడీపీ. అన్ని పక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేతలు...బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కలిసి దీక్షకు మద్దతు కోరారు. రెండు పార్టీలు సానుకూలంగా స్పందించాయి. బీజేపీ సంఘీభావం తెలపగా... జనసేన ప్రతినిధుల బృందాన్ని పంపాలని నిర్ణయించింది.
స్వప్రయోజనాల కోసమే రాష్ట్రంలో ఇసుక కొరత సృష్టించారని నారా లోకేష్ ఆరోపించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడు అడపా రవి కుటుంబాన్ని టీడీపీ నేతలు పరామర్శించారు. లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు లోకేష్. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.. అటు ఇసుక కొరతను నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. భవననిర్మాణ కార్మికలు, వామపక్షాలు అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, దీక్షలు చేపట్టారు.