మాతృభాషపై ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తే మట్టిలో కలిసిపోతారంటూ జనసేనాని.. ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేయగా.. అటు మంత్రులు కూడా జనసేనానికి అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు..
ఏపీలో భాషపై రాజకీయ రచ్చ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. ఆ నిర్ణయాన్ని విపక్షాలు తప్పు పడుతున్నాయి. మాతృభాషను మరచిపోయేలా చేస్తారంటూ ఫైరవుతున్నాయి. కొద్దిరోజులుగా ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇది మరింత శ్రుతిమించి వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. దీనిపై పవన్ కల్యాణ్ అంతే ఘాటుగా కౌంటర్ ఇవ్వగా ఆ తర్వాత మంత్రుల నుంచి కూడా ఎదురుదాడి మొదలైంది.
మాతృభాషను రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తాజాగా జనసేనాని పిలుపునిచ్చారు. ప్రభుత్వ తీరుపై మరోసారి నిప్పులు చెరిగారు. తెలుగు భాషను, సంస్కృతిని నాశనం చేస్తే మట్టిలో కలిసి పోతారంటూ హెచ్చరించారు. ఇంగ్లీషు అవసరమే కానీ.. అందుకోసం తెలుగును చంపకూడదని అన్నారు. మన రాజకీయ నాయకులకు తెలుగు భాష, సంస్కృతి పట్ల ప్రేమ లేదని విమర్శించారు.
అయితే, తనపై వ్యక్తిగతంగా సీఎం చేసిన వ్యాఖ్యలను జనసేనాని ఖండించగా.. మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం సీఎం జగన్ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదంటూ చెప్పుకొచ్చారు. పవన్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని అడిగితే తప్పేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏ పని చేసినా విమర్శించడమే విపక్షాలు పనిగా పెట్టుకున్నాయని బొత్స ఫైరయ్యారు.
మొత్తంగా మాతృభాషపై ఈ పొలిటికల్ మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం ఆగదని విపక్షాలు చెబుతున్నాయి.