ఏపీకి కొత్త సీఎస్ వచ్చేశారు. 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి నీలం సహాని సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆమెను సీఎస్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం నీలం సహాని బాధ్యతలు స్వీకరిస్తారు.
ఊహించినట్టుగానే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా.. సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సహాని నియమితులయ్యారు. ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయ శాఖ కార్యదర్శిగా సేవలందిస్తుండగా.. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు నీలం సహానిని రెండ్రోజుల క్రితమే కేంద్రం రిలీవ్ చేసింది. దీంతో ఆమెను ఏపీ సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. గురువారం ఉదయం 11.20 గం.లకు సచివాలయంలో నీలం సహాని సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో ఎపీ సీఎస్‌గా పని చేసిన 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ కాగా.. ఆయన స్థానంలో తాత్కాలిక సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నీలం సహాని రాకతో.. ఆయన బాధ్యతల నుంచి వైదొలగనున్నారు.
నీలం సహాని 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. ప్రస్తుతం ఉన్న ఐఏఎస్ అధికారులందరిలోనూ ఈమే సీనియర్. నవ్యాంధ్ర తొలి మహిళా సీఎస్ ఈమే కావడం విశేషం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సతీనాయర్, మిన్నీ మాధ్యూ మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని బాధ్యతలు చేపడుతున్నారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీలం సహాని అనేక శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత టెక్కలి సబ్ కలెక్టర్‌గా, నల్గొండ జేసీగా పనిచేశారు. మున్సిపల్ పరిపాలన శాఖ డిప్యూటీ సెక్రటరీగా, హైదరాబాద్‌లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీగా విధులు నిర్వర్తించారు. నిజామాబాద్ జిల్లా పీడీడీఆర్డీయేగా, ఖమ్మం జిల్లాలో CADA అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఇంధన శాఖలో సంయుక్త కార్యదర్శిగా నల్గొండ జిల్లా కలెక్టర్‌గా, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా పనిచేశారు. క్రీడల శాఖ కమిషనర్, శాప్ వీసీ మరియు ఎండీగా ఉమ్మడి రాష్ట్రంలో విధులు నిర్వర్తించారు. 2018 నుంచి ఇటీవలి వరకు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత కార్యదర్శిగా పనిచేశారు. 2020 జూన్ నెలాఖరు వరకు నీలం సహాని సర్వీసులో ఉండనున్నారు.