మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం

Update: 2019-11-16 02:39 GMT

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. శివసేన-ఎన్సీపీ- కాంగ్రెస్‌ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్దమయ్యాయి. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత ఇచ్చారు. తమ ప్రభుత్వం ఐదేళ్లపాటు అధికారంలో ఉంటుందన్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మూడు పార్టీలకు చెందిన నేతలు గవర్నర్ కోషియారీని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా లేఖ ఇవ్వనున్నారు.

ఐదేళ్లు సీఎం పదవిని శివసేనకు ఇచ్చేందుకు NCP ఒప్పుకోగా.. కాంగ్రెస్‌ నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవనే సంకేతాలు వెలువడటంతో సమీకరణాలు మారిపోయాయి. కనీస ఉమ్మడి ప్రనాళికకు మొదట్నుంచీ కాంగ్రెస్‌ పట్టుబడుతుండగా ఇందుకు శివసేన-ఎన్సీపీ సుముఖంగా ఉండటంతో ఆల్‌ క్లియర్‌ అయిపోయింది. డిప్యూటీ సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలన్న ప్రతిపాదనకు కాంగ్రెస్‌-ఎన్సీపీ అంగీకరించాయి. CM పదవితోపాటు మంత్రి పదవుల్లో సింహభాగం శివసేనకే దక్కనున్నాయి. శివసేనకు 16, NCPకి 14, కాంగ్రెస్‌కి 12 మంత్రి పదవులు ఉండేలా ఒప్పందం కుదిరింది. స్పీకర్ పదవి కాంగ్రెస్‌కు, డిప్యూటీ స్పీకర్‌ శివసేనకు దక్కనుంది. మండలి ఛైర్మన్ పదవి ఎన్సీపీకి ఇచ్చే అవకాశాలున్నాయి.

మరోవైపు ఇప్పటికే మూడు పార్టీలు 40 పాయింట్లతో కామన్ మినిమం ప్రోగ్రాం సిద్ధం చేసుకున్నాయి. దీన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా, NCP చీఫ్ శరద్ పవార్‌తోపాటు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ఆమోదించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం కొలిక్కి వస్తే.. ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయినట్టే. ఇక సీఎం పదవి శివసేనకు ఇచ్చేందుకు ఒప్పుకున్నా.. ఆ పార్టీ నుంచి ఎవరు దీన్ని చేపడతారనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. ఉద్ధవ్‌ థాక్రే సీఎం పదవి చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ శివసేన సీఎం పోస్టు కోరడంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఎట్టకేలకు శివసేనతో ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు అంగీకారం కుదరడంతో.. ఈ మూడు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Similar News