పార్టీని కించపరిచేలా ఎవరు మాట్లాడినా ఉపేక్షించొద్దు : చంద్రబాబు

Update: 2019-11-16 02:35 GMT

టీడీపీపై.. ఆ పార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సస్పెన్షన్ వేటు పడింది. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో చంద్రబాబు తన నివాసంలో సమావేశమై.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పలువురు నేతలు జిల్లాల్లోని పరిస్థితులను చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా వంశీ ఎపిసోడ్‌ కూడా చర్చకు వచ్చింది. వంశీ తీరును టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. వంశీ ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేశారని.. వైసీపీలోకి వెళ్లేందుకే పార్టీపై దుమ్మెత్తిపోశారని మెజార్టీ నేతలు చంద్రబాబుకు వివరించారు.

దీంతో ఆగ్రహించిన చంద్రబాబు పార్టీపై ఎవరు ఈ తరహా వ్యాఖ్యలు చేసినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వంశీ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఆయన పార్టీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీపైనా, అధినేతపైనా చేసిన విమర్శలకు 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలంటూ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అటు గన్నవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై కూడా సమావేశంలో చర్చించారు.

మరోవైపు వంశీ గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు.? ఇప్పుడు ఏం మాట్లాడారో తెలిపే ఓ విడీయో మీడియాకు రిలీజ్ చేసింది టీడీపీ. అన్నం తిన్న వారవెరూ వైసీపీలో ఉండరని విమర్శలు చేసిన ఆయన.. ఇప్పుడు ఏ కారణాలతో వైసీపీలోకి వెళ్తున్నారని నిలదీశారు.

ఇక తనపై సస్పెన్షన్‌ వేటు వేయడం, తన వీడియోలను మీడియాకు విడుదల చేయడంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఘాటుగా రియాక్టయ్యారు. తనను సస్పెండ్‌ చేయడానికి వాళ్లెవరంటూ ఫైరయ్యారు. తానే టీడీపీకి రాజీనామా చేశానని చెప్పారు. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని.. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని వంశీ చెప్పారు. అయితే, టీడీపీ నేతలు మాత్రం కేసుల నుంచి బయట పడడానికి.. ఆస్తులను కాపాడుకునేందుకే వంశీ పార్టీ వీడారని ఆరోపిస్తున్నారు.

Similar News