ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎపిసోడ్‌పై తీవ్రంగా చర్చ జరుగుతోంది. టీడీపీని వీడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన వంశీ.. సీఎం జగన్‌తో కలిసి నడుస్తానని చెప్పారు.. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే, అభిమానులు, అనుచరుల సూచనలు, నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల కోసం సీఎం జగన్‌తో చర్చించిన తర్వాత రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానన్నారు. మరోవైపు టీడీపీని వీడిన వంశీ ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయడం లేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, తమ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని తమనే తిట్టించి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని టీడీపీ నేతలు విమర్శించారు.
టీడీపీ విమర్శల నేపథ్యంలో వంశీ రాజీనామా వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలు మారేవారు ఎవరైనా తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని సీఎం జగన్ గతంలోనే ప్రకటించారు. ఫిరాయింపులను ప్రోత్సహించబోమని పదేపదే చెబుతూ వస్తున్నారు. దీంతో వంశీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు ఈ ఎపిసోడ్‌పై రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా స్పందించారు. ఏ సభ్యుడైనా పార్టీ మారాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే చర్యలు తప్పవని అన్నారు.
అటు రాజీనామా అంశంపై ఎమ్మెల్యే వంశీ తనదైన శైలిలో స్పందించారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని వంశీ ప్రకటించారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే.. లోకేష్ ఎందుకు రాజీనామా చేయలేదని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు చంద్రబాబు, లోకేష్, రాజేంద్రప్రసాద్‌పై వంశీ చేసిన వ్యక్తిగత విమర్శలపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఇచ్చిన అవకాశాలతో ఎదిగిన వ్యక్తులు.. ఇప్పుడు ఆ పార్టీ అధినేతనే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని మండిపడ్డారు.
టీడీపీ నేతల విమర్శలపై మరోసారి రియాక్టయ్యారు వల్లభనేని వంశీ. రాజేంద్రప్రసాద్‌లా సౌమ్యంగా మాట్లాడడం తనకు రాదని.. తన భాష, వేషం మొరటుగానే ఉంటుందన్నారు వంశీ. తానెప్పుడూ వ్యక్తిగత అవసరాలకు డబ్బులు తీసుకోలేదని.. తను ఎవరికీ భయపడాల్సిన పని లేదన్నారు వల్లభనేని వంశీ. మొత్తంగా ఈ రాజకీయ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.