అంగన్‌వాడీ 9వ జాతీయ మహాసభలతో చారిత్రక నగరం రాజమహేంద్రవరం మారుమోగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అంగన్‌వాడీలు, హెల్పర్లతో పాటు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు మహాసభలకు తరలివచ్చారు. ర్యాలీలు, ప్రదర్శనలతో హోరెత్తించారు. ఈనెల 20 వరకు మహాసభలు జరగనున్నాయి. అనేక తీర్మానాలను ఆమోదించడంతోపాటు చివరిరోజు నూతన జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు.
రాజమహేంద్రవరంలోని సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. సభలో పాల్గొన్న నేతలు అంగన్‌వాడీలకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సభ ద్వారా ప్రభుత్వాలకు సవాల్ విసిరారు. పాలకులు అనుసరిస్తున్న సరళీకరణ విధానాలే కార్మిక వర్గానికి, ప్రజలకు ఉమ్మడి శత్రువులని జాతీయ కార్యవర్గ నేతలు అన్నారు. వినాశకర విధానాల నుంచి ప్రభుత్వాలను వెనక్కి కొట్టేందుకు ఐక్యపోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సంఘ విస్తరణకు, సంఘటితానికి మహాసభలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ ఉద్యమాల్లోకి రైతులను, కార్మికులను, వ్యవసాయ కార్మికులను, ఇతర స్కీం వర్కర్లను, మహిళలను కలుపుకొనిపోవాల్సిన అవసరం నేతలు గుర్తు చేశారు.
రాబోయే కాలంలో ఐసీడీఎస్‌లను బలోపేతం చేయడం, అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు చేయాల్సిన పోరాటాలపై మహాసభల్లో చర్చించనున్నట్లు మహిళా నేతలు తెలిపారు. రాష్ట్రంలోనూ అంగన్‌వాడీలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.. ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచి చేతులు దులుపుకుందని వారు విమర్శించారు.
బహిరంగ సభకు ముందు అంగన్‌వాడీలంతా కలిసి భారీ ప్రదర్శన నిర్వహించారు.. కంబాల చెరువు సెంటర్ నుంచి ఒక ప్రదర్శన, కోటిపల్లి బస్టాండు నుంచి మరో ప్రదర్శన బహిరంగ సభా స్థలి వరకు నిర్వహించారు. వీరికి దారిపొడవునా ప్రజలు, పలు ప్రజా సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ ప్రదర్శనలో సీఐటీయూ ఆలిండియా ఉపాధ్యక్షురాలు బిబిరాణితోపాటు పలువురు నేతలు, అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని, అంగన్‌వాడీ ఉద్యోగుల బకాయి బిల్లులు చెల్లించాలని, కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అంగన్‌వాడీలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. అమరవీరులకు లాల్ సలామ్ అంటూ మహిళలు నినాదాలు చేశారు. గిరిజనుల కొమ్ము నృత్యాలు, డప్పు కళాకారులతో ర్యాలీ సందడిగా మారింది.