చంద్రబాబు పర్యటనతో కార్యకర్తల్లో జోష్

Update: 2019-11-18 13:28 GMT

టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదని.. ప్రభుత్వ వేధింపులపై చట్ట ప్రకారం పోరాటం చేస్తామని చంద్రబాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. ఇటీవలే బెయిల్‌పై విడుదలైన టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ను పరామర్శించారు. చింతమనేని కుటుంబానికి అండగా ఉంటామని వారికి భరోసా కల్పించారు.

ప్రభుత్వ వేధింపులను ఎండగడుతూ.. నేతలు, కార్యకర్తలకు భరోసా కల్పించేలా టీడీపీ అధినేత చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన సాగింది. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌‌ని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు చంద్రబాబు. అక్రమ కేసులకు తెలుగు తమ్ముళ్లు భయపడవద్దని ధైర్యం చెప్పారు.

చింతమనేనిపై తప్పుడు కేసులు పెట్టి శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా చింతమనేని ధైర్యంగా ఉన్నారని.. ఆయన ఇతర నేతలకు స్పూర్తి అని చెప్పారు. చింతమనేనికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

తప్పుడు కేసులు పెడితే ప్రైవేట్‌ కేసులు వేస్తామని.. చట్ట ప్రకారం పోరాడతామన్నారు టీడీపీ అధినేత. దుగ్గిరాల వస్తుంటే పోలీసులు వ్యవహరించిన తీరు బాధించిందన్న చంద్రబాబు.. పోలీసులు కూడా తనకు అడ్డుపడుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

చింతమనేనిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అటు మాజీ హోంమంత్రి చినరాజప్ప కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని, పోలవరం నిర్మాణాలను నిలిపివేసి రాష్ట్రాన్ని వెనక్కు తీసుకెళ్తున్నారని ఆయన విమర్శించారు.

చింతమనేని పరామర్శించిన అనంతరం చంద్రబాబు తణుకులో జరిగిన టిడీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. తణుకు చేరుకోవడంతో చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. రెండు రోజుల పాటు తణుకులోనే ఉండి నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయనున్నారు చంద్రబాబు. చంద్రబాబు పర్యటన స్థానిక టీడీపీ కార్యకర్తల్లో జోష్‌ నింపింది.

Similar News