అయోధ్య వ్యవహారంలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు పై రివ్యూకు వెళ్లాలని ముస్లిం పక్షాలు నిర్ణయించాయి. తమకు 5 ఎకరాల భూమి అవసరం లేదని ముస్లిం పక్షాలు తేల్చి చెప్పాయి. డబ్బు కూడా అవసరం లేదని స్పష్టం చేశాయి. బాబ్రీ మసీదును కూలగొట్టిన చోటే తమకు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశాయి. సుప్రీంకోర్టు తీర్పు సంతృప్తికరంగా లేదని, తీర్పులో పరస్పర విరుద్ద అంశాలు ఉన్నాయని ముస్లిం పక్షాల నాయకులు పేర్కొన్నారు. నిర్మోహీ అఖాడా పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశా రు.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సమావేశం జరిగింది. జమాతే ఉలేమా హింద్ సహా పలు సంఘాలు ఈ మీటింగ్‌లో పాల్గొన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు పై విస్తృతంగా చర్చించారు. రివ్యూకు వెళ్లాలా వద్దా అని సమాలోచనలు జరిపారు. రివ్యూకు వెళ్లొద్దంటూ లక్నో సున్నీ వక్ఫ్ బోర్డు చేసిన డిమాండ్‌ను పరిశీలించారు. ఇతర కక్షిదారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. తర్జనభర్జనల అనంతరం సుప్రీం తీర్పుపై రివ్యూకు వెళ్లాలని తీర్మానించారు. రివ్యూ కోరడమం కోర్టు ధిక్కరణ కిందికి రాదని ముస్లిం లా బోర్డు న్యాయవాది పేర్కొన్నారు.
ఈనెల 9వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం అయోధ్య కేసులో చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల భూభాగాన్ని రామజన్మభూమి న్యాస్‌కు కేటాయించిన సుప్రీంకోర్టు, అక్కడే రామమందిరం నిర్మించా లని ఆదేశించింది. రామాలయ నిర్మాణానికి అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. ముస్లిం పక్షాలకు 5 ఎకరాలు కేటాయించాలని సూచించింది. ఈ తీర్పుపై ముస్లిం పక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. సుప్రీం ఆదేశాలపై రివ్యూ కోరడం తమ హక్కు అని జమాతే ఉలేమా హింద్ నాయకుడు మౌలానా అర్షద్ మదానీ పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు తీర్పుపై ముస్లిం పక్షాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికైనా సమస్య ముగిసిపోయిందని చాలామంది అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూకు వెళ్లకూడదని, సున్నీ వక్ఫ్ బోర్డు నిర్ణయించింది. ఐతే, 67 ఎకరాల్లోనే మసీదు నిర్మాణానికి 5 ఎకరాలు కేటాయించాలని సూచించింది. ఈ నేపథ్యంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం రివ్యూకు వెళ్లాలని నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.