సోమవారం ప్రారంభమైన శీతాకాల సమావేశాల్లో రగడ మెుదలైంది. ముందుగా.. ఇటీవలే మరణించిన మాజీ సభ్యులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, రాంజెఠ్మలానీ, జగన్నాథ్ మిశ్రా సహా పలువురికి ఉభయ సభలు నివాళులు అర్పించాయి. అటు లోక్‌సభలో కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. సంతాప తీర్మానాలు అయిన వెంటనే విపక్షాల నినాదాలతో సభ మార్మోగింది. మహారాష్ట్రలో రైతు సమస్యలపై చర్చించాలని శివసేన ఆందోళనబాట పట్టింది. నినాదాలు చేసింది. అటు కశ్మీర్ అంశంపై కాంగ్రెస్ చర్చించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపింది. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభ్యుల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ఓ దశలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి జోక్యం చేసుకుని.. సభ్యులు సహకరించాలన్నారు. అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని.. బీఏసీలో తుది నిర్ణయం తీసుకుందామని విజ్ఞప్తి చేశారు.