మూడు ముళ్లు.. ఏడడుగులు.. బాజాభజంత్రీల మధ్య వారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అత్తారింట్లోకి అడుగు పెట్టిందో లేదో ఆయన నచ్చలేదంటూ గొడవ చేయసాగింది. పెళ్లై వారం రోజులేగా అయింది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. అందాక గొడవలు పెట్టుకోకండి అని పెద్దలు సర్ధి చెప్పారు. అయినా ఆమె వినిపించుకోలేదు. ఈ మొగుడితో నేను కాపురం చేయలేను. ఉంటే ఆయనైనా ఉండాలి లేదా నేనైనా అని ఒక నిర్ణయానికి వచ్చేసింది. అంతే పాలల్లో విషం కలిపి ఇచ్చింది భర్త పీడ వదిలించుకోవడానికి. ప్రేమగా ఇచ్చిందనుకున్నాడే కాని అందులో విషం కలిపిందని గుర్తించని లింగమయ్య పాలు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడి పరిస్థితి గుర్తించిన సోదరుడు లింగమయ్యను గుత్తి ఆసుపత్రికి తరలించాడు. పరిస్థితి విషమించడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.