అయోధ్య వ్యవహారంపై మళ్లీ రగడ మొదలు..

Update: 2019-11-19 03:24 GMT

అయోధ్య వ్యవహారంపై మళ్లీ రగడ మొదలైంది. సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ కోరాలంటూ ముస్లిం పక్షాలు నిర్ణయించడాన్ని హిందూ పక్షాలు తప్పుపడుతున్నాయి. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు రివ్యూ పిటిషన్ ఎలా వేస్తుందని అఖిల భారత హిందూ మహాసభ ప్రశ్నించింది. అయోధ్య కేసులో ముస్లిం లా బోర్డు కక్షిదారు కాదని హిందూ మహాసభ పేర్కొంది. కక్షిదారులకు మాత్రమే పిటిషన్ వేసే అవకాశముంటుందని తెలిపింది. అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిందని, అందులో ఏ తప్పు కనిపిస్తోందని హిందూ మహాసభ న్యాయవాది వరుణ్ సిన్హా ప్రశ్నించారు. కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం సుప్రీం తీర్పును తప్పుబడుతున్నారని విమర్శించారు.

కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా , సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టారు. అయోధ్య కేసులో సర్వోన్నత న్యాయస్థానం తప్పుడు తీర్పు ఇచ్చిందన్నారు. సుప్రీం తీర్పులో ఎన్నో లొసుగులు ఉన్నాయన్నారు. తీర్పు ఎలా ఉన్నా ముస్లిం పక్షాలు ఆమోదించాలని సూచించారు. జరిగిందేదో జరిగిపోయిందని, ఇప్పుడు ముందుకు సాగడం తప్ప మరో మార్గం లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మరో తీర్పు వచ్చే అవకాశం ఉండ బోదన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై అద్వానీ, మరికొందరు బీజేపీ సీనియర్‌ నేతలు మొదట పశ్చాత్తాపం వ్యక్తం చేశారని, ఆ తర్వాత రామ మందిర నిర్మాణ ఉద్యమం ద్వారా వచ్చిన కీర్తి కారణంగా ఆ విషయం పూర్తిగా విస్మరించారని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాక్రే అయోధ్య పర్యటన రద్దైంది. ఈనెల 24న అయోధ్య రామమందిర నిర్మాణ ప్రాంతాన్ని ఉద్ధవ్ థాక్రే సందర్శిస్తారని గతవారం శివసేన వర్గాలు తెలిపాయి. ఐతే, థాక్రేకు తాము రక్ష ణ కల్పించలేమని, ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వలేమని అధికారవర్గాలు తెలిపాయి. అలాగే, మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో థాక్రే బిజీగా ఉన్నారు. అటు అనుమతులు రాకపోవడం, ఇటు ప్రభుత్వ ఏర్పాటు పనుల్లో మునిగి ఉన్నందు వల్ల అయోధ్య పర్యటనను థాక్రే రద్దు చేసుకున్నట్లు సమాచారం.

అయోధ్య కేసులో నవంబర్ 9న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూభాగాన్ని రామ్‌జన్మభూమి న్యాస్‌కు కేటాయించింది. అక్కడే రామమందిరాన్ని నిర్మించాలని ఆదేశించింది. రామాలయ నిర్మాణానికి అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. ముస్లింలకు మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే 5 ఎకరాలు కేటాయించాలని సూచించింది. ఈ తీర్పుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీం తీర్పుపై రివ్యూ కోరాలని నిర్ణయించింది.

Similar News