మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న హైడ్రామా ఊహించని మలుపులు తీసుకుంటోంది.. నిన్నటిదాకా శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఉత్సాహం చూపిన ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు చర్చలే జరగలేదని తేల్చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ-శివసేన కలిసి పోటీ చేశాయని వారికి వారే..తాము వేరేనంటూ సేన -ఎన్‌సీపీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు కుదరదని స్పష్టం చేశారు.
విశేష అంచనాలు, ఊహాగానాల మధ్య కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సమావేశం అయ్యారు. 45 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపైన గానీ, శివసేన పార్టీతో పొత్తు గురించి గానీ తాము చర్చించనే లేదని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపైనే సోనియాతో సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. ఏకే ఆంటోనీ కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలిపారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి కొందరు నాయకులు సమావేశమై తదుపరి చర్చలు జరిపిన తర్వాత తమ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని పవార్ చెప్పుకొచ్చారు
శివసేన ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాలంటే వారు అతివాద హిందూత్వ లైన్‌ను వదులుకోవాలని, పలు అంశాలపై లౌకిక వాదానికి కట్టుబడాలని కాంగ్రెస్ ప్రతిపాదిస్తోంది. అందుకు సుముఖంగానే ఉన్న ఉద్ధవ్ ఈ నెల 24న తలపెట్టిన అయోధ్య పర్యటనను వాయిదా వేసుకున్నారు. దీనికి అధికారిక కారణాలు చెప్పకపోయినా..సంకీర్ణ కూటమి షరతులే అని భావిస్తున్నారు.
మరోపక్క బీజేపీ మూడేళ్లు, శివ సేన రెండేళ్లు సీఎం పదవి తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి రాందాస్ ఆథవాలే కొత్త ప్రతిపాదన చేశారు. దీనికి సేన సుముఖంగా ఉందన్నారు. ఆందోళన వద్దు. మంచే జరుగుతుందని బీజేపీ-సేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని అమిత్ షా తనతో చెప్పారని అనడంతో రాజకీయం మరింత ఉత్కంఠంగా మారింది.
మరోవైపు పార్లమెంట్‌లో ఎన్సీపీ,బీజేడీపై మోదీ ప్రశంసలు కురిపించారు. ఎన్సీపీ,బీజేడీ ఒక్కసారి కూడా వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేయలేదని అయినప్పటికీ చర్చల సమయంలో వారు సమర్ధవంతమైన అంశాలను లేవనెత్తుతూ ప్రజల హృదయాలను గెలుచుకున్నారని కొనియాడారు. బీజేపీ సహా అందరూ వారి నుంచి నేర్చుకోవాలన్నారు. మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న సమయంలో మోదీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.