అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 27 రోజులు గడుస్తున్నా.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. శివసేనతో కలిసి ఎన్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అందరూ భావిస్తుండగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బాంబ్ పేల్చారు. అసలు శివసేనతో చర్చలే జరగలేదన్నారు. 288 మంది ఎమ్మెల్యేలు ఉన్న సభలో శివసేనకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఎక్కడ నుండి వస్తుందో ఆ పార్టీ నేతలే చెప్పాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాతో సమావేశం అనంతరం శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి.
శరద్ పవార్ వ్యాఖ్యలపై శివసేన కూడా స్పందించింది. అయితే శరద్ పవార్ తీరుపై తమకు ఎలాంటి అనుమానం లేదన్నారు. మహారాష్ట్రలో డిసెంబరు మొదటి వారంలో శివసేన అధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు. తాము ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతోన్న తరుణంలో తమ పార్టీని ఎన్డీఏ నుంచి తొలగించడంపై బీజేపీపై శివసేన అధికార పత్రిక సామ్నాలో విమర్శలు గుప్పించింది.
ప్రస్తుతం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. 288 అసెంబ్లీ స్థానాలు కలిగిన మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్‌సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ-శివసేన మధ్య అధికారపంపిణీ చర్చల్లో తలెత్తిన విబేధాలతో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయాయి. ఎన్సీపీ- కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని శివసేన భావించినా.. తాజా పరిణామాలు చూస్తుంటే అసాధ్యమనిపిస్తోంది. అటు బీజేపీ-శివసేన మధ్య కేంద్రమంత్రి రాందాస్ అథేవాలా రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు.