సమ్మె యథావిధిగా కొనసాగించాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఆర్టీసీ సమ్మెపై బుధవారం హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. అప్పటి వరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమ్మె, భవిష్యత్ కార్యాచరణపై ఆర్టీసీ యూనియన్లు వేర్వేరుగా సమావేశం ఏర్పాటు చేసుకున్నాయని.. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత నిర్ణయాన్ని జేఏసీకి అప్పగిస్తూ తీర్మానించాయన్నారు. బుధవారం జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని కార్మిక సంఘాలన్నీ హామీ ఇచ్చాయని అశ్వత్థామరెడ్డి వివరించారు.
అంతకుముందు ఆర్టీసీ కార్మికులతో జేఏసీ సమావేశం సుదీర్ఘంగా సాగింది. ఎల్బీనగర్‌లో యూనియన్ల నేతలు ఎవరికి వారే సమావేశాలు ఏర్పాటు చేసుకుని కార్మికుల అభిప్రాయాలను సేకరించారు. సమ్మెను కొనసాగించాలా వద్దా అనే దానిపై జిల్లాల వారీగా కార్మిక సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించారు. సమ్మె విరమిస్తే ఉద్యోగ భద్రత ఏంటని చాలామంది కార్మికులు ప్రశ్నించారు. ఒకవేళ సమ్మెను విరమిస్తే తిరిగి విధుల్లోకి తీసుకుంటారా లేదా అనే ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో మెజారిటీ కార్మికులు సమ్మె కొనసాగించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే లేబర్ కోర్టులో చాలా సమయం పడుతుందని మరికొందరు కార్మికులు అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్టు సమాచారం. మూడు నెలల నుంచి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అటు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సమావేశంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బ్యాలెట్ పెట్టి అభిప్రాయాలు తీసుకోవాలని కార్మికులు కోరారు. ఇలా డిపోల నుంచి కార్మికుల అభిప్రాయలు తీసుకున్న తరువాత.. జేఏసీ నేతలు ప్రత్యేకంగా సమావేశమై సమ్మె ప్రకటన చేశారు. బుధవారం డిపోల వారిగా అభిప్రాయలు తీసుకోవాలని.. అలాగే రాజకీయా పార్టీలతో సమావేశమై.. సమ్మెపై బుధవారం తుది ప్రకటన చేయాలని జేఏసీ నేతలు నిర్ణయించారు.