పార్లమెంట్లో రఘురామకృష్ణంరాజు ప్రసంగంపై దుమారం రేగింది. తెలుగుభాషపై ఆయన చేసిన ప్రసంగం ఆయనపై అధినేత ఆగ్రహానికి దారి తీసింది. అటు విపక్షాలకు అస్త్రంగా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో ఎంపీ తీరుపై మండిపడ్డారు.
కేంద్రం నుంచి నిధుల కోసం తప్ప తెలుగుభాషా సరస్వతి దేనికీ పనికిరాదన్నమాట... ఇదేనా ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉద్దేశం అని పవన్ ప్రశ్నించారు. ఎంపీ మాటలు వింటే తమకు అదే అనిపించిందన్నారు పవన్. 350A కింద నిధులు అడుగుతున్న ఎంపీ.. వాటిని ఇంగ్లీష్ మీడియం కోసం ఖర్చు చేస్తారా అని పవన్ ప్రశ్నించారు. 350A ఆర్టికల్ ఉద్దేశం ప్రాంతీయభాషను ప్రోత్సహించమని.. కాపాడమని.. చిన్నారులకు మాతృభాషలో విద్య బోధించమని చెబుతుందని గుర్తుచేశారు. ఏపీలో ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుందని చెబుతున్న వైసీపీ 350A కింద నిధులు ఎలా అడుగుతుందని పవన్ ప్రశ్నించారు.
అటు రఘురామకృష్ణంరాజు తీరుపై జగన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ నుంచి వివరణ తీసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి ఇలా ప్రభుత్వ విధానాలకు విరుద్దంగా వ్యవహరిస్తే.. పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్టు తెలుస్తోంది. పేద పిల్లల అభ్యున్నతి కోసమే ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే.. ఇందుకు భిన్నంగా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించినట్టు సమాచారం. రఘురామకృష్ణంరాజు నుంచి వివరణ తీసుకోవాలని ఉభయగోదావరి జిల్లాల పార్టీ ఇన్ ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డిని జగన్ ఆదేశించారు.