మహారాష్ట్ర సరికొత్త చరిత్ర లిఖించడానికి సిద్ధమవుతోంది. దశాబ్దాలుగా ఒకరకమైన రాజకీయ సంస్కృతికి అలవాటుపడిన మరాఠాలు, రెండు-మూడు రోజుల్లో కొత్తరకమైన రాజకీయ సంస్కృతిని చూడబోతున్నారు. కాషాయదళం, సెక్యులర్ పార్టీలు అన్నట్లుగా సాగిన మహా పాలిటిక్స్, ఇప్పుడు రూట్ మార్చుకున్నారు. కాషాయదళం నుంచి ఓ భాగం చీలిపోయి సెక్యులర్ పార్టీలతో జట్టు కట్టింది. భిన్న భావజాలం ఉన్న కాంగ్రెస్- శివసేన ఏకం అయ్యాయి. రెండు పార్టీల మధ్య అనుసంధానకర్తగా ఎన్సీపీ కీ రోల్ పోషించింది. పొత్తు దాదాపుగా ఖారారు కావటంతో ఇక పదవుల పంపకాలపై చర్చలు ఊపందుకున్నాయి. నిన్న ఢిల్లీలో ఎన్సీపీ-కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఆ తర్వాత చర్చల వేదిక ముంబై మారింది. రాత్రి పొద్దుపోయే వరకు ఎన్సీపీ-శివసేన మధ్య చర్చలు జరిగాయి.
చర్చోపచర్చల తర్వాత మూడు మూడు పార్టీలకు 14-14-14 చొప్పున మంత్రి పదవులు ఉండాలని కాంగ్రెస్ తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. సీఎం పదవి విషయంలో కొద్దిగా పీటముడి పడినా..చివరికి ఉద్ధవ్ థాకరేకు ముఖ్యమంత్రి పదవిపై ఎన్సీపీ, కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇక ఏయే మంత్రి పదవులు ఏయే పార్టీకి ఇవ్వాలనేది కూడా క్లారిటీకి వచ్చే పనిలో ఉన్నాయి ఈ మూడు పార్టీలు. సంకీర్ణ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ, పీడబ్ల్యూడీ, హోం మంత్రిత్వశాఖ, ఉన్నత విద్య, గ్రామీణాభివృద్ధి వంటి మంత్రి పదవులను శివసేన కోరుకుంటోంది. ఎన్‌సీపీ.. స్పీకర్ పదవిని కోరుకుంటోంది. అలాగే, హోం శాఖ, ఆర్థికం, పీడబ్ల్యూడీ, జలవనరులు, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలను అడగ్గా, స్పీకర్, ఆర్థికం, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ శాఖను కాంగ్రెస్ కోరుకుంటోంది. మంత్రి పదవుల విషయంలో మరింత స్పష్టత కోసం ఇవాళ మరోమారు నేతలు సమావేశం కానున్నారు.
శుక్రవారం చర్చల్లో స్పష్టత రాగానే ఈ వారాంతంలోనే మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం కొలువుదీరే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ దిశగా జరిగిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన వస్తుందని శివసేన నాయకులు పేర్కొన్నారు. స్వీట్లు కూడా ఆర్డరిచ్చామని సంతోషంగా చెబుతున్నారు.
సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలతో పాటు అటు కాంగ్రెస్ పార్టీ శుక్రవారం విడిగా సమావేశం కాబోతోంది. మహారాష్ట్ర విధాన సభలో జరిగే ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకుంటారు. మరోవైపు ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనూ మహా రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. మతతత్వ పోకడలపై పోరాడే క్రమంలోనే శివసేనకు మద్దతు ఇవ్వక తప్పడం లేదని కాంగ్రెస్ శ్రేణులకు సోనియా వివరించినట్లు సమాచారం.
మొత్తానికి శివసేన పంతం నెగ్గించుకుంది. ముఖ్యమంత్రి పీఠం కోసం బీజేపీకి కటీఫ్ చెప్పిన శివసేన, ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్-ఎన్సీపీలతో అవగాహన కుదుర్చుకుంది. బీజేపీ పొత్తుతో దక్కని రోటేషన్ సీఎం పీఠాన్ని ఇప్పుడే ఐదేళ్ల పూర్తి కాలం శివసేన దక్కించుకుంది.