అందానికి అదనపు మెరుగులు అద్దుకోవాలని భావించింది ఓ మహిళ. ఇందుకు దేశంలోనే అతిపెద్ద బ్యూటీ సెలూన్ కంపెనీ బ్రాంచికి వెళ్లింది. హీరోయిన్ లా మెరిసిపోవాలని కలలు కన్నది. కానీ ఆమె అనుకున్నదొకటి.. జరిగింది మరొకటి. అందానికి మరింత సొగసులు అద్దుతామని చెప్పిన బ్యూటీ పార్లర్ వాళ్లు... చివరకు ఇలా ముఖమంతా నల్లగా కమలిపోయేలా వికారంగా మార్చారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆ బాధితురాలు. స్నేహితులు చెప్పారని బ్యూటీపార్లర్ కు వెళితే.. ఏవేవో కెమికల్స్ రాసి.. ముఖమంతా పాడుచేశారంటూ కన్నీరుమున్నీరవుతోంది.
యూపీలోని కాన్పూర్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మనీషా అనే మహిళ.. నగరంలోని ఓ ప్రముఖ బ్యూటీపార్లర్ కు వెళ్లింది. తన శరీరం చాలా సెన్సిటీవ్ అని.. జాగ్రత్తగా మేకప్ చేయాలని కోరింది. ఒకే అని చెప్పిన సిబ్బంది.. ఆమెకు మేకప్ చేసి ఇంటికి పంపారు. ఇంటికెళ్లిన తర్వాత ముఖంపై మంట మొదలైంది. తట్టుకోలేక మేకప్ కడిగింది. తీరా చూస్తే ముఖమంతా మచ్చలు వచ్చాయి. నల్లగా చారలు వచ్చి.. కమిలిపోయి కనిపించింది. బ్యూటీపార్లర్ కు వెళ్లి నిలదీస్తే.. మాకు సంబంధం లేదంటూ తప్పించుకున్నారట. దీంతో పోలీసులకు ఫిర్యాదుచేసింది బాధితురాలు.
బ్యూటీపార్లర్ లో వాడిన కెమికల్స్ వల్ల ఆమె ముఖం పాడైందని.. డాక్టర్లు తేల్చారు. బ్యూటీ ముసుగులో చాలా సంస్థలు కెమికల్స్ వాడుతున్నాయని.. అవి మంచివి కాదని వైద్యులు అంటున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. కెమికల్స్ రియాక్షన్ వస్తే.. శరీరం నల్లబడటమే కాకుండా క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మహిళలు మేకప్ మాయలో పడి.. అడ్డమైన క్రీమ్స్ రాసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.